కొండపాక(కుకునూరుపల్లి), నవంబర్ 25: కేసీఆర్ మిత్రుడు, దొమ్మాట మాజీ ఎమ్మెల్యే దొమ్మాట రాంచంద్రారెడ్డి(85) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు దవాఖానలో మృతిచెందారు. ఆయన స్వగ్రామం సిద్దిపేట జిల్లా కొండపాక. ఆయనకు భార్య అనంతలక్ష్మిలో పాటు ఇద్దరు కూతుళ్లు సీత, గీత ఉన్నారు.
నేవిలో ఉద్యోగం చేసిన రాంచంద్రారెడ్డి టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1985లో కేసీఆర్ సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు దొమ్మాట నుంచి రాంచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది రెండు నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేశారు. నాలుగున్నరేండ్లు తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేసిన రాంచంద్రారెడ్డి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ప్రభుత్వంలో అల్లుళ్ల పెత్తనం చెలాయించడంతో ఎన్టీఆర్‌ను విభేదించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు.
ఎన్టీఆర్‌తో విభేదించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాంచంద్రారెడ్డికి ఎమ్మెల్యే కోటాలో కనీసం ఇంటి స్థలం కూడా దక్కలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ఉన్న కేసీఆర్ రాంచంద్రారెడ్డికి ఫోన్ చేసి అన్న ఈ తమ్ముడు ఉన్నాడని మరువకు, నీకు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయాలని కోరారు. కొండపాకలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ రాంచంద్రారెడ్డి పరిస్థితిని గుర్తుపెట్టుకొని ఆయనకు సిద్దిపేటలో ఇంటి స్థలం ఇవ్వాలని నాటి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు. కేసీఆర్ వెళ్తుండగా రాంచంద్రారెడ్డి తన కూతుళ్లతో కేసీఆర్‌ను కలిసేందుకు రావడంతో వారిని ఆప్యాయంగా పలకరించడంతో పాటు భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అంటూ వారిని ఆయన వెంట తీసుకువెళ్లారు.
అనారోగ్యంతో మృతి చెందిన దొమ్మాట మాజీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి పార్థివదేహానికి కొండపాక మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో హరీశ్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాంచంద్రారెడ్డి కేసీఆర్‌కు ఎంతో ఆత్మీయుడు అన్నారు. ఆయన ఎప్పుడు ప్రజాసేవ, అభివృద్ధిపైనే తపన పడ్డారని కొనియాడారు. దొమ్మాట మాజీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి కోరిక మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొండపాక అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేశామన్నారు.
రాంచంద్రారెడ్డి దవాఖాన వైద్య ఖర్చులకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించడంతో పాటు సిద్దిపేటలో ఇంటి స్థలాన్ని ఇచ్చి గౌరవించుకున్నామని చెప్పారు. వారి మృతి బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన వెంట ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కొండపాక మాజీ ఎంపీపీ బొద్దుల కనకయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, రైతుబంధు సమితి మాజీ కన్వీనర్ ర్యాగల దుర్గయ్య, అంబటి బాలచందర్‌గౌడ్, చిక్కుడు భాను తదితరులు ఉన్నారు.