జహీరాబాద్, జూలై 16 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఈదులపల్లి శివకుమార్ కోరారు. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర చెరుకు పరిశ్రమల సంచాలకుడు, చెరుకు కమిషనర్ సీహెచ్ నర్సిరెడ్డిని ఆయన మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జహీరాబాద్ ప్రాంతంలో అత్యధికంగా 25 వేల ఎకరాల్లో రైతులు చెరుకు పంట సాగు చేస్తారని, సంవత్సరానికి 10 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు ఉత్పత్తి అవుతుందన్నారు. మూడేండ్లుగా జహీరాబాద్ మండలంలోని కోత్తూర్(బీ) శివారులోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం మూతపడడంతో ఈ ప్రాంత చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కోత్తూర్(బీ)లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారాన్ని కొత్త యాజమాన్యం కొనుగోలు చేసినప్పటికీ క్రషింగ్ ప్రారంభించలేదన్నారు. అప్పటి వరకు సమీపంలోని చక్కెర కర్మాగారాల ద్వారా చెరుకు సేకరణ, రవాణా, క్రషింగ్ చేసే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.