మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 5: రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణా సంస్థ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆదేశాల మేరకు వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన జిల్లాస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనల్లో అత్యుత్తమంగా నిలిచిన 5 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైనట్లు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ హుస్సేన్ నేతృత్వంలో నిపుణుల బృందంతో పాటు ఇన్నోవేషన్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా మూల్యాంకనం చేసినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్, న్యాయ నిర్ణేతలు దినాకర్, తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు.
నర్సాపూర్ మండలం బంజారానగర్ జడ్పీహెచ్ఎస్కు చెందిన అభిలాశ్గౌడ్ కదిలే బహుళార్థక నిచ్చెన ప్రాజెక్టు, తూప్రాన్ కేజీబీవీకి చెందిన విద్యార్థిని శ్రావణి మత్తు పదార్థాలను గుర్తిం చే ఇండికేటర్ ప్రాజెక్టు రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యాయి. తూప్రా న్ కేజీబీవీ విద్యార్థిని ప్రణతి స్మార్ట్ స్కూల్ బ్యాగ్ ప్రాజెక్టు, టేక్మాల్, జడ్పీహెచ్ఎస్ విద్యార్థి విష్ణునాయక్ వ్యర్థ ప్లాస్టిక్ నుంచి ఇటుకల తయారీ, నాగ్సన్పల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థి విష్ణువర్ధన్ యాంటీ తెఫ్ట్ ఏటీఎం ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి.