మెదక్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా ఓటర్ల సంఖ్య 4,09,473 మందిగా తేలింది. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలంటూ అధికార గణం విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో నెల రోజుల వ్యవధిలో 9,860 మంది కొత్తగా ఓటర్లు నమోదయ్యారు. జిల్లా ఓటర్ల తుది జాబితాను ఈ నెల 5వ తేదీ (గురువారం) ప్రకటించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
జిల్లాలో కొత్తగా 9,860 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గతేడాది నవంబర్ 9న ప్రకటించిన జాబితా ప్రకారం 4,06,629 మంది ఓటర్లు ఉన్నారు. జనవరి 5న ప్రకటించే జాబితా ప్రకారం జిల్లా ఓటర్ల సంఖ్య 4,09,473కు పెరిగింది. ఇదిలావుండగా, మెదక్ నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువగా 5,178 మంది ఓటర్లు నమోదయ్యారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 4,682 మంది ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలున్నాయి. వీటిలో నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోనే ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మొత్తంగా 2,06,837 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 1,04,710, పురుషులు 1,02,120 మంది, ఇతరులు ఏడు మంది ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలో మొత్తం 2,02,636 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,05,077 మంది మహిళలు, 97,556 మంది పురుషులు ఉన్నారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు.
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతున్నది. జిల్లాలో 18 నుంచి 49 ఏండ్ల వరకు ఉన్న ఓటర్లే సగం మంది ఉన్నారు. అయితే జిల్లా అధికారులు ఓటు హక్కు నమోదు శాతాన్ని పెంచేందుకు ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానంగా నూతన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల సూచిస్తున్నారు.