నర్సాపూర్, ఆగస్టు 2 : కొండపోచమ్మ కాలువ నిర్మాణంలో తన భూమి పోతుందన్న బెంగతో ఓరైతు గుండెపోటుకు గురై మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. చిన్నచింతకుంట గ్రామానికి చెందిన రైతు వంటేల రామ్‌రెడ్డి(58)కి సర్వేనెంబర్ 183/ అ3/1లో రెండెకరాల పొలం ఉంది. ఉన్న పొలం కాస్త కొండపోచమ్మ కాల్వ నిర్మాణంలో పోతుందని, కాల్వ నిర్మాణం చేపట్టవద్దని 22 రోజులుగా నర్సాపూర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నాడు. తన భూమి కాలువలో పోతుందని కొద్దిరోజులుగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. శుక్రవారం ఉదయం 3 గంటలకు తన ఇంట్లో గుండెపోటుకు గురై మృతిచెందాడు.
గుండెపోటుతో అకాల మరణం పొందిన రైతు వంటేల రామ్‌రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కొండపోచమ్మ కాలువ భూనిర్వాసితులు చిన్నచింతకుంట గ్రామ సమీపంలోని నర్సాపూర్-మెదక్ జాతీయ రహదారిపై శుక్రవారం రాస్తారోకో చేశారు. ఏఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డితో మాట్లాడించారు. బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చూస్తానని ఆర్డీవో హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రాస్తారోకోలో రైతులు మహేశ్, రామకృష్ణ, అంజాగౌడ్, నారాయణ, శ్రీనివాస్, శ్రీశైలం యాదవ్, పెంటయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.