గజ్వేల్, జూన్ 15: దేశంలో కులమతాల పేరుతో ఓట్ల అడిగి రాజకీయ లబ్ధిపొందిన ఏకైక పార్టీ బీజేపీ అని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నరేంద్రమోదీ మార్క్ అభివృద్ధి కేంద్రంలో, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడుందని ప్రశ్నించారు. దేశంలో బీజేపీకి ఈసారి పూర్తిస్థాయి మెజార్టీ ఇవ్వకుండా ప్రజలు ఛీ కొట్టారన్నారు. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి మోదీ ప్రభుత్వానికి ఎదురైందన్నారు.
అబ్ధదపు, మోసపూరిత హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదన్నారు. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వకుండా ప్రభుత్వరంగాలను ప్రైవేటుపరం చేశారన్నారు. అదానీ, అంబానీలకు దేశాన్ని తాకట్టుపెట్టే పరిస్థితి తెచ్చిపెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రదాత కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలను మానుకోవాలని హితవు పలికారు. గజ్వేల్‌లో కేసీఆర్ మార్క్ అభివృద్ధి కనిపిస్తున్నా బీజేపీ నాయకులకు అది అర్థం కావడం లేదన్నారు.
పదేండ్లలో తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేశారా అని ఆయన ప్రశ్నించారు. గజ్వేల్‌ను కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఎడ్యుకేషన్ హబ్, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నిర్మాణం చేసి సాగు నీరిందించిన ఘనత ఆయకే దక్కుతుందన్నారు. ములుగులో విద్యార్థుల కోసం యూనివర్సిటీ ఏర్పాటు చేశారన్నారు. గతంలో ఎన్నడూ కనిపించని అభివృద్ధి నేడు గజ్వేల్‌లో కనిపిస్తున్నదన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను వందశాతం అమలు చేయాలన్నారు.