తూప్రాన్, ఏప్రిల్ 8: రైతన్నలు ఎదుర్కొంటున్న కరువు కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఐదెకరాల వరి పంట ఎండిపోయి, తీవ్రంగా నష్టపోయిన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్‌కు చెందిన రైతు పెద్దికారి దేవయ్య పొలాన్ని సందర్శించి, ఆయన్ను పరామర్శించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీనిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో మండుటెండల్లో సైతం పుష్కలంగా నీరు ఉండేదని, దీంతో వానాకాలం, యాసంగి పంటలకు ఎలాంటి ఢోకా లేదన్నారు.
కానీ కాంగ్రెస్ పాలనలో సమయానికి నీళ్లు వదలకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. రైతు దేవయ్య ప్రతాప్‌రెడ్డితో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గుంట పొలం కూడా ఎండిపోయేది కాదని, 24 గంటల ఉచిత కరెంటుతో పాటు, ఎండాకాలంలో సైతం నీటికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు. తమకున్న ఐదెకరాల పొలం ఎండిపోవడంతో తినడానికి తిండి కూడా లేదంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుచేసి మరీ ఎకరానికి రూ.30 వేల చొప్పున సుమారు రూ.లక్షా యాభై వేలు పెట్టుబడి పెట్టానని, అంతా బూడిదలో పోసిన పన్నీరైందన్నారు.
అనంతరం ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, పూటకోమాట మాట్లాడుతూ రైతులను నిండా ముంచిందన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఎడారిలా ఉన్న తెలంగాణ, స్వరాష్ట్రం సిద్దించాక సస్యశ్యామలంగా మారిందన్నారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కితే, అధోగతి పాలు చేసిన ఘనత కాంగ్రెస్‌కు దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ హయాం లో కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్‌లో పుష్కలంగా గోదావరి జలాలు ఉండేవని, ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా కరీంనగర్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో రైతులకు తాగునీరందించిందన్నారు. పంటలు ఎండిపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట రాణీసత్యనారాయణగౌడ్, ఆంజనేయులుగౌడ్, కృష్ణారెడ్డి, రాజు, రమేశ్ తదితరులు ఉన్నారు.