నంగునూరు, నవంబర్ 2 : స్వయంగా ప్రభుత్వమే పంపిణీ చేసిన మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తక రైతులు నష్టపోయిన సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని గట్లమల్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ఎంతో కష్టపడి వేసుకున్న విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే నకిలీ విత్తనాలు పంపిణీ చేసి రైతులను నిండా ముంచిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గట్లమల్యాల గ్రామంలో జాతీయ ఆహార భద్రత పథకం కింద నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ సంస్థకు చెందిన సీఈటీ 4260 మొక్కజొన్న విత్తనాలను ఇటీవల అధికారులు సబ్సిడీపై రైతులకు అందించారు.సుమారు 20 మంది రైతులు వాటిని వేసుకోవడంతో అవి మొలకెత్తలేదు. దీంతో సుమారు 30 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు. ఇతర మార్కెట్లో కొనుగోలు చేసిన విత్తనాలు మొలకెత్తి, ప్రభుత్వ పరంగా సబ్సిడీపై కొనుగోలు చేసిన విత్తనాలు మాత్రం ఒక్కటి కూడా మొలకెత్తక పోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో నమ్మకంతో విత్తనాలు వేస్తే అవి తీరా పదిహేను రోజులు దాటినా మొలకెత్తక పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసినందుకు రైతులకు రసీదు ఇవ్వకపోవడం గమనార్హం. ఏకంగా వ్యవసాయ అధికారులే ప్రతిసారి తప్పకుండా రసీదు తీసుకోవాలని సూచిస్తారని, కానీ.. వారు పంపిణీ చేసినప్పుడు మాత్రం రసీదు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పుడు తాము ఎవరిని అడగాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము వ్యవసాయ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తే కేవలం వచ్చి చూసిపోయారే తప్పా ఎలాంటి హామీ ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు మండలానికి ఒక వ్యవసాయ అధికారి, క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి ఉన్నారు.
కానీ, వారెవరూ క్షేత్రస్థాయిలో పంట పొలాలను సందర్శించకపోగా.. రైతులకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం లేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు కేవలం పెట్టుబడి మాత్రమే నష్టపోరు. విలువైన సమయంతో పాటు పంట ఆలస్యమైతే నీటి ఎద్దడి ఏర్పడి దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఒక ఎకరానికి విత్తనాలు, దున్నకం, కూలీల ఖర్చుతో సహా మొత్తం రూ.13,500 ఖర్చు అయ్యిందని, ఇప్పుడు మళ్లీ విత్తనాలు వేయాలంటే మరో రూ.13,500 ఖర్చు అవుతుందని, మొత్తం ఎకరాకు రూ.26 వేల వరకు అవుతుందని రైతులు తెలిపారు.
ఎకరాకు రూ.25 వేల వరకు నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, దీనిపై మండల వ్యవసాయ అధికారి గీత స్పందించారు. గట్లమల్యాలలో 20 మంది రైతులకు చెందిన పొలాల్లో మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తలేదన్నారు. తాము చేన్లను పరిశీలించామని, మొలకశాతం తక్కువగా ఉండడంతో విత్తనాలు మొలకెత్తని మాట వాస్తవమే అని పేర్కొన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదించి, రైతులకు నష్ట పరిహారం అందించేందుకు కృషిచేస్తామని తెలిపారు.
పంట మొలకెత్తలేదని ఏఈఓను సంప్రదిస్తే వచ్చి చూశారు తప్పా ఎలాంటి హామీ ఇవ్వలేదు. మాకు విత్తనాలు ఇచ్చే సమయంలో అసలు ఎలాంటి రసీదు ఇవ్వలేదు. వ్యాపారుల వద్ద కొనేటప్పుడు బిల్లులు తీసుకోవాలని చెప్పే వ్యవసాయ అధికారులు ఇలా ప్రభుత్వం పంపిణీ చేసే సబ్సిడీ విత్తనాలకు సంబంధించి రసీదు ఇవ్వకపోవడం తగదు. మాకు నకిలీ విత్తనాలు ఇచ్చారు. అధికారులే మాకు న్యాయం చేయాలి.
– ఇటికల కోటి, రైతు, గట్లమల్యాల(సిద్దిపేట జిల్లా)
విత్తనాల పంపిణీలో జరిగిన అక్రమాలపై వెంటనే వ్యవసాయ అధికారులు స్పందించాలి. మాకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలి. లేకపోతే వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ప్రభుత్వం పంపిణీ చేసిన విత్తనాల్లో ఇలాంటి లోపాలు ఉన్నాయి కాబట్టి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– ముడికె రాజయ్య, రైతు, గట్లమల్యాల(సిద్దిపేట జిల్లా)