గజ్వేల్, జూలై 19: కాంగ్రెస్, బీజేపీ కలిసి ఉద్యమ పార్టీని దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సుప్రీంకోర్టులో రేవంత్‌రెడ్డిపై ఉన్న ఓటుకు నోటు కేసును ఎందుకు పెండింగ్‌లో పెట్టారని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు కాపాడుతుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రాహుల్‌గాంధీ కంటే ఎక్కువగా నరేంద్రమోదీ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలతో రేవంత్‌రెడ్డి, నరేంద్రమోదీ జతకట్టి బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నారన్నారు. ఉద్యమ పార్టీ ప్రజల్లో బలంగా ఉందని, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై పోరాడుతామన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా గజ్వేల్ నియోజకవర్గంలో కాలువ, ప్రాజెక్టుల కింద నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారని, కానీ నేడు సాగునీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలంకావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల పక్షాన పోరాటం చేసినా ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు స్పందించడం లేదని, చుక్క నీటిని విడుదల చేయడం లేదన్నారు. రూ.2లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం ఇరిగేషన్‌కు పైసా కేటాయించలేదని, కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.25వేలకోట్లను కేటాయించిందన్నారు. కన్నెపల్లి వద్ద మోటర్లు ఆన్‌చేసి ప్రాజెక్టులు నింపాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించడం లేదని, అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదన్నారు. పేదలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉందని, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్ తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రైతుల గోస పట్టడం లేదని, గ్లోబల్ ప్రచారంతో వాస్తవాలు చెప్పకుండా అబద్ధపు మాటలు చెబుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వానికి ఓటర్లే తగిన బుద్ధి చెబుతారన్నారు సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు దేవీ రవీందర్ పాల్గొన్నారు.