హత్నూర, ఆగస్టు 5: ప్రభుత్వం ఇటీవల పంట రుణమాఫీ చేయడంతో రైతులు తిరిగి పంట రుణాలు తీసుకోవడం కోసం బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. రుణాలు మాఫీ అయిన రైతులకు రోజుకు 30 మందికే బ్యాంకు సిబ్బంది రుణాలు మంజూరు చేస్తుండడంతో ఎక్కు వ సంఖ్య లో వచ్చిన రైతులు తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. హత్నూర మం డలం వడ్డేపల్లి ఏపీజీవీబీలో మండలంలోని 12 గ్రామాలతోపాటు నర్సాపూర్ మండలంలోని ఎల్లాపూర్, జిన్నారం మండలంలోని అండూర్ గ్రామాల రైతులు బ్యాం కులో పంట రుణాలు తీసుకున్నారు.
బ్యాం కులో (1800) ఖాతాదారులు ఉండగా, మొదటి, రెండో విడుతల్లో వెయ్యిమంది రైతులకు రుణమాఫీ వచ్చింది. దీంతో రుణమాఫీ వచ్చిన రైతులు తిరిగి రుణాలు పొందడం కోసం రోజూ బ్యాంకు వద్దకు వచ్చినా రోజు కు 30మందికి మాత్రమే రుణాలు మంజూరు చేస్తుండడంతో రైతు లు అవస్థలు పడుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి వరకు పట్టాదారు పాస్ పుస్తకాలతో క్యూలైన్లో నిలిచినా సీరియల్ నెంబర్ రాకపోతే వెనుదిరిగి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.