గజ్వేల్, జూలై 30: వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలమట్టం తగ్గింది. రైతుల బోర్లలో అనుకూలంగా నీళ్లు రాక మడులు తడవక నాట్లు వేయడం ఈ సంవత్సరం రైతులకు గగనంగా మారింది. నాట్లు వేసేందుకు అనుకూలమైన కార్తెలు గడుస్తుండగా నేటికీ వర్షాలు పడక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చెంతనే మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులు ఉన్నా రైతులకు మేలు చేసేలా ప్రభు త్వం చర్యలు చేపట్టక రైతులు దిగులుపడుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి కొండపోచమ్మ ప్రాజెక్టును నింపుకొని దాని ద్వారా రైతాంగానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో సాగునీరు అందించింది. దీంతో రైతులు వరి, కూరగాయ పంటలు సాగు చేసుకొని జీవనం కొనసాగించారు.
ఈ యేడు అం దుకు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నా యి. భూగర్భ జలమట్టం తగ్గడంతో రైతులకు సాగు పెద్ద సమస్యగా మారింది. 50టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ ప్రాజెక్టులోకి వెళ్లే కాలువ నుంచి గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కూడవెల్లి వాగులోని ఒక టీఎంసీ కాళేశ్వరం జలాలను వదిలితే గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో రైతులకు ఉపయోగకరంగా ఉండడంతో పాటు లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములు సాగులోకి వస్తాయి. కూడవెల్ల్లి ప్రవాహం కరీంనగర్ జిల్లాలోని అప్పర్‌మానేరు వర కు వెళ్లడంతో రైతులు వరిసాగు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
వర్షాకాలంలో ఒక టీఎంసీ నీటిని వదిలితే రైతులు సాగు చేసే పంటలకు జీవంపోసినట్లు అవుతున్న ది.15టీఎంసీల సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ ప్రాజెక్టు సంగారెడ్డి కాలువ ద్వారా ఒక టీఎంసీ నీటిని వదిలిలే హల్దీవాగు మీదుగా నిజాంసాగర్ వరకు ప్రవాహం ఉండడంతో పాటు హల్దీవాగుపై ఉన్న చెక్డ్యాముల్లో నీటి నిల్వతో రైతులకు సాగునీరు అందనున్నది. వర్గల్, తూప్రాన్, వెల్దుర్తి, మెదక్ మీదుగా నీటి ప్రవాహం కొనసాగనున్నది. రైతులు వరినాట్లు వేయాలంటే తప్పక కాలువల ద్వారా సాగునీళ్లు వదలక తప్పదు. నేటికీ 50శాతం కూడా వరినాట్లు పడలేదు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే కాళేశ్వరం కా లువలోకి నీటిని విడుదల చేయాలని డి మాండ్ చేస్తూ ఆగస్టు 2న రాజీవ్, జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మిరుదొడ్డి, జూలై 30 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నప్పుడు మల్లన్నసాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఉంచినప్పుడు మా బోరు బాగా పోసేది. ఇప్పు డు మల్లన్న సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేక ఎండి పోతున్నది. దీంతో కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయలేదు. బోర్లు నీళ్లు పోయక వరి నాట్లు ఎట్లా వేయాలో అర్థంకావడం లేదు. బోర్లు పోస్తున్న కొద్ది నీళ్లతో రెండు మూడు మడుల్లో వరినాటు వేసుకుంటున్నాం. ప్రభుత్వం మల్లన్నసాగర్‌లోకి గోదావరి నీళ్ల నింపి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం.
– లింగాల శివారెడ్డి, రైతు, మిరుదొడ్డి, సిద్దిపేట జిల్లా
మిరుదొడ్డి, జూలై 30 : కూడవెల్లి వాగులో నీళ్లు ఉంటేనే మా బోరు పోస్తది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి కూడవెల్లివాగులోకి నీళ్లు విడుదల చేయక యాసంగిలో వరి పంట కూడా ఎండిపోయింది. ఇప్పటికే వానకాలం సగం అయిపోయింది. చెరువులు, కుంటల్లోకి నీళ్లు రాలేదు. కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మల్లన్న సాగర్‌ను నింపడంతోపాటు కూడవెల్లివాగుతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపితే బోర్లు ఊరుతాయి. మల్లన్నసాగర్‌లోకి రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు తెచ్చి రైతులను ఆదుకోవాలి.
-స్వామి, రైతు మిరుదొడ్డి, సిద్దిపేట జిల్లా
గజ్వేల్, జూలై 30: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం వెంటనే కొడకండ్ల వద్ద నిర్మించిన కాలువ ద్వారా కూడవెల్లి వాగులోకి సాగునీళ్లు వదలాలి. ప్రస్తుత సీజన్లో వర్షాలు నేటి వరకు సరిగ్గా పడక భూగర్భ జలమట్టం తగ్గింది. బోర్లలో నీళ్లు తక్కువగా వస్తున్నాయి. చాలా మంది రైతులు వరినాట్లు వేయలేదు. కూడవెల్లి ద్వారా కాళేశ్వరం జలాలను వదిలితే చెక్‌డ్యామ్‌లు నిండుతాయి. రైతులకు న్యాయం జరుగుతది. కాళేశ్వరం జలాలను వదిలేందుకు ప్రభుత్వం ముందుకొచ్చి నీళ్లిచ్చి రైతులను ఆదుకోవాలి.
– నరేశ్ గౌడ్, కొల్గూర్, గజ్వేల్ మండలం, సిద్దిపేట జిల్లా
గజ్వేల్, జూలై 30: సీజన్‌కు ముందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంగారెడ్డి కాలువలోకి నీళ్లు వదలడంతో హల్దీవాగులో ఎప్పుడూ నీళ్లు ఉండేవి. రైతులందరూ వరిసాగు చేసేది. ఇప్పటికీ వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలమట్టం తగ్గడంతో బోర్లు తక్కువగా పోస్తున్నా యి. బోర్లలో నీళ్లు రాకపోవడంతో చాలా మంది రైతులు ఇప్పటి వరకు వరినాట్లు వేయలేదు. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం జలాలను విడుదల చేస్తే చెక్‌డ్యామ్‌లో నీళ్లు పుష్కలంగా చేరి బోర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. గత ప్రభుత్వం ఎప్పుడూ రైతుల మేలు కోసమే ఆలోచించేది. ఈ ప్రభుత్వం రైతులకు కనీసం సాగునీళ్లు ఇవ్వడం లేదు.
– చింతల రాములు, దండుపల్లి, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా
మర్కూక్, జూలై 30: బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొండపోచమ్మ ప్రాజెక్టును నింపి కాలువల ద్వారా నీళ్లు ఇచ్చేది. ఐదారేండ్ల నుంచి ఐదు ఎకరాల్లో వరి నాటు వేశా. రెండు పంటలకు సంబంధించి నీళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు నింపలేదు. కాలువలో నీళ్లు లేక బోరు మోటరే దిక్కయింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
– పత్తి రమేశ్,రైతు, దామరకుంట, మర్కూక్ మండలం సిద్దిపేట జిల్లా
తూప్రాన్, జూలై 30: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండుటెండల్లో కూడా గోదావరి నీళ్లు పారేవి. ఇప్పుడు హల్దీవాగు పూర్తిగా ఎండిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు పుష్కలంగా వర్షాలు కురిసి కాలం బాగా అయింది. గోదావరి జలాలు కూడా హల్దీవాగులోకి వదిలే వారు. వాగు నుంచి వేసుకున్న పైప్‌లైన్ ద్వారా పంట పొలాలు పం డేవి. కానీ ఈసారి కాలం వెనక్కి వెళ్లింది. వర్షాలు పడే సూచన కనిపిస్తలేదు. హల్దీవాగుకు నీటిని వదలకపోతే పొలాలు పూర్తిగా ఎండిపోతాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి హల్దీ వాగులోకి గోదావరి నీళ్లను వదలాలి.
– వట్యాకుల సురేందర్‌రెడ్డి, రైతు, యావాపూర్, తూప్రాన్ మండలం, మెదక్ జిల్లా
తూప్రాన్, జూలై 30: ఆబోతుపల్లి వాగు గడ్డకు ఎనిమిది ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. నీళ్లకోసం ఎదురుచూసిన సందర్భాలు ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు వర్షాలు పడక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిని చూస్తే వర్షాలు పడేలా కనిపించడంలేదు. దేవుడి మీద భారం వేసి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయానికి వాగు నీళ్లు తప్పా వేరే ఆధారం లేదు. వర్షాల కోసం చూసీ చూసీ ఇప్పుడు దున్నకాలు మొదలు పెట్టా. గోదావరి నీళ్లను వెంటనే హల్దీవాగులోకి వదిలి చెక్‌డ్యాములు నింపినా వ్యవసాయం ముందుకు సాగుతది. నీళ్లు వదలకపోతే మా పరిస్థితి ఆగమే.
– లంబ నరేందర్ యాదవ్, కౌలు రైతు, తూప్రాన్, మెదక్ జిల్లా