న్యాల్కల్, సెప్టెంబర్ 9: నిమ్జ్ ప్రాజెక్టుకు భూ ములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తే 15 రోజుల్లోనే పరిహారం అందజేస్తామని జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం హద్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ హద్నూర్ గ్రామానికి చెందిన 32 మంది రైతులు 112.9/2 ఎకరాల భూములను నిమ్జ్ ప్రాజెక్టుకు ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. ప్రభుత్వం భూములు కోల్పోయిన బాధత రైతులకు పరిహారం కింద రూ.16.83 కోట్లను మంజూ రు చేసిందన్నారు. ఈ నిధులను సంబంధిత రైతు ల బ్యాంకు ఖాతాలో ఆన్లైన్ ద్వారా జమ చేస్తామని చెప్పారు. మండలంలోని గ్రామాల్లో రైతులు నిమ్జ్‌కు భూములు ఇవ్వాలని, ఆసక్తి ఉంటే సంబంధిత అధికారులకు అంగీకార పత్రాలను అందజేయాలని సూచించారు. వారికి 15 రోజుల్లోనే ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందని చెప్పా రు.
భూములు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లిన రైతులు కేసులను విరమించుకోవాల్సి ఉంటుందన్నారు. నిమ్జ్ ప్రాజెక్టుకు భూములు ఇస్తామని అంగీకారపత్రాలను అందజేసే రైతులకు సంబంధించిన ప్రభుత్వ, పట్టా భూములకు ఎకరానికి రూ.15 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో నిమ్జ్ డిప్యూటీ తహసీల్దార్లు గడ్డం జనార్దన్, రాచయ్యస్వామి, అధికారు లు సురేఖ, గ్రామ నాయకులు రాజ్‌కుమార్, షబ్బీర్‌ఖాన్, మహేశ్, నర్సారెడ్డి, గుండారెడ్డి, రైతులు పాల్గొన్నారు.