నర్సాపూర్, ఏప్రిల్ 17: నర్సాపూర్ పట్టణంతోపాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో గురువారం సాయంత్రం వడగండ్ల వాన కురిసి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వాన, వనగండ్లతో పాటు ఈదురుగాలులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నీరుడి పెంటయ్య ఇంటి రేకులు ఈదురుగాలులకు పూర్తిగా కొట్టుకుపోయాయి.
నారాయణపూర్ ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడడంతోపాటు మూడు స్తంభాలు ఒరిగిపోయాయి. దీంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వగనండ్ల వానతో రైతన్నల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. చేతికొచ్చిన వరి పంట వనగండ్లకు నేలరాలడంతో రైతన్నలు ఆవేదన చెందారు. వనగండ్ల వానతో పంట నష్టం తీవ్రంగా ఉంటుందని రైతులు వాపోతున్నారు.
చిన్నశంకరంపేట, ఏప్రిల్ 17: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. శాలిపేట, మిర్జాపల్లి తదితర గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. ఒక్కసారిగా గాలివాన రావడంతో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. గాలివానకు మండలంలోని వివిధ గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
మామిడితోటల్లో మామిడి కాయలు నేలరాలి, చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. గాలివాన బీభత్సంతో పాటు వడగండ్ల వర్షం కురియడంతో చేతికి అందిన పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తే చేతికి అందిన పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట సాగు కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు పడిపోయారు.