నర్సాపూర్, ఏప్రిల్ 18: ఆరుగాలం కష్టపడి చేతికొచ్చిన వరిపంట వనగండ్లకు నేల పాలయ్యింది. ఇంకో వారం రోజుల్లో ధాన్యాన్ని అమ్ముకొని నాలుగు పైసలు సంపాదించుకుందామనుకున్న అన్నదాతల నోట్లో వడగండ్లు మట్టిని కొట్టాయి. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పు ఓవైపు… వడగండ్ల వానతో నేలరాలిన ధాన్యం మరోవైపు రైతన్నలను గుండెపగిలేలా చేశాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం భయంకరమైన వడగండ్లతో కూడిన భారీ వర్షం రైతన్నలను అతలాకుతలం చేసింది.
భారీగా వడగండ్లు పడటంతో చేతికొచ్చిన వరి ధాన్యం నేలరాలింది. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతన్నలు నేలరాలిన ధాన్యాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం కుప్పలు సైతం తడిసిముద్దయ్యాయి. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు. నర్సాపూర్ మండలంలో 925 ఎకరాల వరి పంట, 6 ఎకరాల మామిడి తోట దెబ్బతిన్నట్లు ఏవో దీపిక పేర్కొన్నారు.
పంట చేతికొచ్చిందని తెల్లారి కోత కోద్దామనుకున్నా… తెల్లారేసరికి వడగండ్లతో అంతా నేలపాలైంది. రెండున్నర ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వరిసాగు చేశా. గ్రామానికి సమీపంలో పొలం ఉండడంతో కోతుల బెడద విపరీతంగా ఉండేది. రాత్రింబవళ్లు పొలం వద్దనే ఉంటూ కాపలా కాశా. పంట పెట్టుబడి కోసం సుమారు రూ.70 వేలు ఖర్చయింది. అప్పు తీసుకొచ్చి మరీ పంట వేశా. గలగల ఉండే పంట ఒక్క రోజులోనే నేల రాలిపోయింది. వనగండ్లకు ఒక్క ఇత్తు లేకుండా రాలిపోయింది. తెచ్చిన అప్పులు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం కనికరించి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
– కంజర్ల పోచయ్య, తిర్మలాపూర్, నర్సాపూర్ మండలం
నర్సాపూర్, ఏప్రిల్ 18: వడగండ్లతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, గిరిజన తండా, రుస్తుంపేట, పెద్దచింతకుంట, చిన్నచింతకుంట, లింగాపూర్, గొల్లపల్లి , తిరుమలాపూర్ గ్రామాల్లో వడగండ్ల వానతో నష్టపోయిన వరిపంటను శుక్రవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వడగండ్లతో సుమారు 900 ఎకరాల వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని వెల్లడించారు. రైతులు ఎకరానికి రూ.30 వేలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయాధికారులు రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నష్టపోయిన పంటలకు పంటబీమా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. పంటలతో పాటు ఈదురుగాలులకు కరెంట్ స్తంభాలు, రేకుల షెడ్లు నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని డి మాండ్ చేశారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుం దన్నారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ మాజీ మెంబర్ మన్సూర్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు సత్యంగౌడ్, వంజరి శ్రీనివాస్, శ్రీనివాస్‌గౌడ్, కొండల్, నర్సింగ్, రైతులు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట, ఏప్రిల్ 18: వడగండ్లతో దెబ్బతిన్న పంటలను శుక్రవారం మండల వ్యవసాయ అధికారి లక్ష్మీప్రవీణ్ పరిశీలించారు. మండలంలోని శాలిపేట తదితర గ్రామాల్లో 120 మంది రైతులకు చెందిన 70 ఎకరాల్లో వరి పంట వడగండ్లకు దెబ్బతిన్నదని తెలిపారు. దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. ఆయన వెంట ఏఈవో శేఖర్ ఉన్నారు.