గుమ్మడిదల, మార్చి 13: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లికి చెందిన రైతు కుమ్మరి ఆంజనేయులు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పంటలు పండించుకోవడానికి తొమ్మిది నెలల క్రితం బోరుబావిని తవ్వించారు. నీరు రావడంతో ఎనిమిది నెలల క్రితం బోరుమోటరుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని రూ.5725 విద్యుత్‌శాఖకు డీడీ కట్టారు.
విద్యుత్ అధికారులు అప్పటి నుంచి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్కు కనెక్షన్ ఇవ్వడంతో తన భూమిలో సొర, బీర, కొత్తిమీర, కీరా వంటి పంటలు సాగుచేశాడు. వేసవి కావడంతో ట్రాన్స్ఫార్మర్పై అధికంగా లోడ్ పడిందని 25 రోజుల క్రితం రైతు ఆంజనేయులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌ను తొలిగించారు. దీంతో నీరందక పంటలు ఎండిపోయి సుమారు రూ.2లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ అధికారులు అదనంగా మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎనిమిది నెలలుగా కాలయాపన చేశారని, తీరా ఇటీవల ట్రాన్స్ఫార్మర్పై లోడ్ పడిందని తన విద్యుత్ కనెక్షన్‌ను తొలిగించి తీవ్రంగా నష్టపోయేలా చేశారని రైతు ఆంజనేయులు వాపోయాడు. దీనిపై సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇచ్చిన కనెక్షన్‌ను తిరిగి ఇచ్చారు. అయినప్పటికీ 25 రోజుల క్రితం తొలిగించిన విద్యుత్ కనెక్షన్ కారణంగా తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతు ఆంజనేయులు తెలిపారు. కాగా, రైతు ఆంజనేయులు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుతో విద్యుత్‌శాఖ అధికారులు ఆగమేఘాల మీద నల్లవల్లి రైతుల కోసం అదనపు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు.