రామాయంపేట, మే 09: కనీస వసతుల్లేకుండానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు (Paddy Procurement Centre) నడుస్తున్నాయి. రామాయంపేట పురపాలిక పరిధిలోని గొల్పర్తి పెద్దమ్మ దేవాలయం వద్ద అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే కనీస వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఒక పక్క ఎండ, మరో పక్క తాగడానికి నీరులేవు, కనీసం నీడకు ఉందామన్నా రైతులకు టెంటులేదు. తాగునీరు కావాలన్నా నీటి వసతి అసలే లేదు. దూప తీరాలంటే దగ్గలోనే అందుబాటులో ఉన్న బోరుబావులను ఆశ్రయించాల్సిందే.
దీంతో కనీస వసతులు లేక ధాన్యం తీసుకొచ్చిన రైతులు అల్లాడుతున్నారు. అక్కడ ఉన్న చెట్లే వారికి నీడనిస్తున్నాయి. రోడ్డు పక్కనే ఎర్రటి ఎండలోనే తూకం వేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పిస్తున్నామని గొప్పలు చెప్పడమే తప్ప అక్కడ కనీస వసతులు ఉన్నాయా అనే ధ్యాస కూడా లేదు. రోడ్డు పక్కనే ఉన్న కొనుగోలు కేంద్రం వద్ద కనీసం నిలువ నీడకూడా లేదు. అక్కడ ఉన్న చెట్టే అక్కడున్న రైతులకు నీడనిస్తున్నాయి. రైతులే వాటర్ బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుని చెట్ల నీడన కూర్చుని దాహం తీర్చుకుంటున్నారు.
ఎండలోనే పడి చస్తున్నం..
ప్రభుత్వం అధికారులు కొనుగోలు కేంద్రం వద్ద కనీసం తాగడానికి కూడా నీళ్లు పెట్టలేదని గొల్పర్తికి చెందిన నాగిరెడ్డి, మంజుల రైతు దంపతులు చెప్పారు. ఎండలో ఉంటున్నామని, నిలబడదామన్నా ఎక్కడ కూడా నీడ లేదన్నారు. చెట్ల నీడే తమకు దిక్కైతుందని, ఇంటి నుంచి నీళ్లు తెచ్చుకుని తాగుతున్నామని తెలిపారు. దూప అయితే బోరుబావుల వద్దకు వెల్లి డబ్బాలలో తెచ్చుకుంటున్నామని వెల్లడించారు.
మ్యాచర్ వచ్చినా తూకం వేయడం లేదు
తమ ధాన్యంను వారం రోజులుగా ఎండ బోస్తున్నామని ఎర్రొళ్ల నర్సింహులు-లక్ష్మి దంపతులు తెలిపారు. మ్యాచర్ వచ్చినా ఇంకా రాలేదంటు నిర్వాహకులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కనీసం కూర్చునేందుకు కూడా ఇక్కడ గింత నీడ కూడాలేదని చెప్పారు. చెట్ల నీడలోనే కూర్చుంటున్నాం. ఒక పక్క ఎండలు మండి పోతున్నా తమకు ఈ తిప్పలు తప్పడం లేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నీటివసతి కల్పించాలని కోరారు.