మిరుదొడ్డి, నవంబర్ 27: పండించిన మక్కలు అమ్మి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో మక్కరైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వానకాలంలో భారీ వర్షాలు, తుపాన్ల ఎఫెక్ట్‌తో అన్నిరకాల పంటలు దెబ్బతిన్నాయి. యూరియా కొరత రైతులను ఇబ్బందులకు గురిచేసింది. సకాలం యూరియా అందక మొక్కజొన్న పంట ఆశించిన దిగుబడి రాలేదు. చేతికి వచ్చిన మక్కలను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయక పోవడంతో దళారులు రైతులు అమ్ముకున్నారు. క్వింటాల్‌కు రూ.1800 ధరకే దళారులు కొనుగోలు చేయడంతో రైతులకు క్వింటాలుకు రూ. 600 వరకు నష్టం వాటిళ్లింది. తీరా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కృషితో మిరుదొడ్డిలో అక్టోబర్ 25న ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి, అక్బర్పేట-భూంపల్లి, దౌల్తాబాద్, దుబ్బాక మండలాలకు కలిసి మిరుదొడ్డిలో ఒకే మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించడంతో మక్కలు అమ్ముకోవడానికి రైతులు వారం, పదిరోజుల పాటు కొనుగోలు కేంద్రంలోనే నిరీక్షించాల్సి వచ్చింది. మక్కలు అమ్మి నెల గడుస్తున్నా రైతుల ఖాతాల్లో డబ్బులు మాత్రం జమకాలేదు. యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో వరి విత్తనాలను తెచ్చుకొని రైతులు నారు పోయడానికి చేతిలో డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిరుదొడ్డి కొనుగోలు కేంద్రంలో అక్టోబర్ 25 నుంచి నవంబర్ 23 వరకు 328 మంది రైతుల నుంచి 10,250 క్వింటాళ్ల మక్కలను కొన్నారు. 20,500 బ్యాగుల్లో 29 లారీల్లో మక్కలు తరలించారు. రైతులకు రూ.2.46 కోట్ల డబ్బులు చెల్లించాల్సి ఉంది. వెంటనే మక్కల డబ్బులు జమ చేయకుంటే ఆందోళనలు చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.