రాయపోల్, జూన్ 3 : ధాన్యం కొనుగోలు చేసి తమ ఇబ్బందులు తొలిగించాలని కోరుతూ బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వీరనగర్, అంకిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతులు గజ్వేల్-చేగుంట ప్రధాన రహదారిపై బైఠాయించి రెండు గంటల పాటు రాస్త్తారోకో నిర్వహించారు. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కిలోమీటరు పొడవునా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ 50 శాతం ధాన్యం కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయే అవకాశం ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ధాన్యాన్ని మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడానికి సిద్ధంగా ఉన్న వాటిని వెంటనే తూకం వేయాలన్నారు.
ఈ విషయం తెలుసుకున్న రాయపోల్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న రైతులను సముదాయించినా వినలేదు. రైతులు ఆందోళన మరింత ఉధృతం చేశారు. సంబంధిత అధికారులు వచ్చి సమాధానం ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. తొగుట సీఐ అక్కడి రైతులతో ఫోన్లో మాట్లాడారు. వీరనగర్, అంకిరెడ్డిపల్లి గ్రామాలకు లారీలు వచ్చే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.