చిన్నకోడూర్ ఆగస్టు 17:అబద్ధపు మాటలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15వతేదీలోపు రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తానని ప్రమాణం చేసి తెలంగాణ రైతులు, ప్రజలను మోసం చేశాడని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్,సీనియర్ నాయకుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల రాజీవ్ రహదారిపై శనివారం రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతులు చేస్తున్న రాస్తారోకోకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయకుండా కాలయాపన చేయడమే కాకుండా పంటరుణమాఫీ చేయమని అడిగిన రైతులు, బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయించి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంట రుణమాఫీ చేయకపోగా ప్రజా నాయకుడు హరీశ్‌రావును రాజీనామా చేయాలని రేవంత్‌రెడ్డి మాట్లాడటం దొంగేదొంగ అన్నట్లు ఉన్నదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల పంటరుణమాఫీ తక్షణమే చేయాలని, లేకుంటే సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు, ఎంపీపీ పాపయ్య, ఆర్ఎస్ నాయకులు కొండం రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కాముని ఉమేశ్ చంద్ర, వైస్ సుంచు రమేశ్, మిట్టపల్లి గణేశ్, బైండ్ల సుధాకర్, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్, చెందు, సాయి, రైతులు పాల్గొన్నారు.
చిన్నకోడూరు మండలకేంద్రంలో రెండు లక్షల పంటరుణమాఫీ కాని రైతులు అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్దఎత్తున శనివారం ధర్నా చేపట్టారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రెండు లక్షల పంట రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పంట రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి అందరికీ పంట రుణ మాఫీ అయిందంటూ అబద్ధపు ప్రచారాలు మానుకొని అంద రికీ మాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు.