నర్సాపూర్, ఆగస్ట్ 3:మార్కెట్ ధర చెల్లించాకే తమ భూములను త్రిబుల్ఆర్ నిర్మాణానికి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లిలో త్రిబుల్ ఆర్ నిర్మాణానికి భూసర్వే చేయడానికి వచ్చిన అధికారులను భూములు కోల్పోతున్న రెడ్డిపల్లి, చిన్నచింతకుంట రైతులు అడ్డుకున్నారు.
సర్వేచేసే ప్రాంతంలో బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. సర్వే చేయడానికి ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి పోలీస్, సీఆర్పీ బలగాలతో రావడంతో రెడ్డిపల్లిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిం ది. ఈ సందర్భంగా సర్వే అధికారులు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, సర్వేయర్ మొగులయ్యను సర్వే చేయకుం డా రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడు తూ..త్రిబుల్ ఆర్ రోడ్డు 17 గ్రామాల నుంచి వెళ్తుండగా, ఆ గ్రామాల్లోని రైతుల సహకారంతో సర్వే పూర్తి చేశామని తెలిపారు.
రెడ్డిపల్లిలో మాత్రం సర్వే పనులు మిగిలిపోయినట్లు చెప్పారు. రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని, తాము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిబంధనలు పాటిస్తామని వెల్లడించారు. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం భూములకు ధర కట్టించి భూసేకరణ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. తమకు 15 రోజులు సమయం కావాలని, సంబంధిత ప్రజా ప్రతినిధులను కలిసి సమస్యను పరిష్కరించుకుంటామని అధికారులకు రైతులు విజ్ఞప్తి చేశారు. దీంతో సర్వే చేయకుండానే అధికారులు వెనుతిరిగారు.