న్యాల్కల్, జూన్ 23 : సోయాబీన్ నూనెగింజల పంట. తక్కువ కాలంలో మంచి దిగుబడి ఇచ్చే పప్పు జాత పంటగా సోయాబీన్ పంటను చెప్పవచ్చు. సోయాబీన్ వర్షాధార పంట. ఎకరాకు ఎనిమిది నుంచి 10క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పంట సాగుతో భూసారం పెరిగే అవకాశం ఉండడంతో రైతులు సోయాబీన్ సాగుచేస్తున్నారు. ఈ పంట సాగుకు నల్లరేగడి భూములు అనువైనవి. ముందుగానే భూములను చదును చేసుకుని విత్తనం విత్తుటకు సిద్ధం చేసుకోవాలి. సోయా సాగులో మెళకువలు పాటిస్తూ, సకాలంలో చీడపీడల నివారణ చేపడితే మంచి దిగుబడిని పొందడంతో పాటు ఆదాయం లభిస్తుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
విత్తనశుద్ధి..
సోయాబీన్ పంట విత్తడానికి ముందు ప్రతి కిలో సోయాబీన్ విత్తనానికి 2 గ్రాముల థైరమ్, 1 గ్రాము కార్బండిజమ్ లేదా 3గ్రాముల థైరమ్ లేదా కాప్టన్ మందుతో, తరువాత 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 30 గ్రాముల కార్బోస్ఫాన్తో విత్తనం శుద్ధిచేయాలి. ప్రతి 8-10 కిలోల విత్తనానికి 200గ్రాముల రైజోబియం జపానికం కల్చర్ కలిపి నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత విత్తుకోవాలి.
విత్తడం..
చదును చేసిన నేలల్లో సోయాబీన్ విత్తనాలు విత్తాలి. ముఖ్యంగా నల్లరేగడి భూముల్లో అయితే 45 సెంటీమీటర్ల వెడల్పు, 5సెంటీ మీటర్ల దూరం, తేలిక భూముల్లో అయితే 30 మీటర్ల వెడల్పు, 7.5 సెంటీ మీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎకరానికి సుమారుగా 25 నుంచి 30 కిలోల వరకు సోయాను విత్తుకోవాలి.
ఎరువుల యాజమాన్యం..
సోయాబీన్ సాగు చేసే భూముల్లో ఎకరానికి 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ చివరి దుక్కిలో వేయాలి. భాస్వరం ఎరువును సింగిల్ ఫాస్పేట్ రూపంలో వేస్తే గంధకం కూడా లభిస్తుంది. 50 శాతం నత్రజని విత్తేటప్పుడు, పైరు నెల రోజులకు చేరిన తర్వాత మరో 50శాతం నత్రజని వేయాలి. సోయా పంట ఎదుగుదలకు పూత, కాత దశలో 2 శాతం యూరియా 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాల్సి ఉంటుంది. పంటలకు చిత్త పురుగులు, రసం పీల్చే పురుగు, కాండం తొలిచే పరుగు, ఈగ, ఆకు గూడు పురుగు, పొగాకు లద్దె పురుగులు ఆశిస్తాయి. వీటి నివారణకు 1 గ్రామం ఎస్సీఫేట్ లేదా మోనోక్రోటోఫాస్ 6 మిల్లీ లీటర్లు లేదా క్లోరిఫెరిఫాస్ 2.5 మిల్లీ లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కలుపు నివారణ..
సోయాబీన్ పంటలో కలుపు నివారణ కోసం పెండిమిథాలిన్ 30శాతం 1.4 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేయాలి. సోయా విత్తిన 20-25 రోజుల్లో గొర్రుతో అంతర కృషి చేయాలి. లేకుంటే కిజాల్ఫాస్ ఇథైన్ 5 శాతం 400 మిల్లీ లీటర్ల కలిపి పిచికారీ చేసి గడ్డి జాతి మొక్కలను, ఇమాజిథాఫైర్ 10 శాతం 250 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసి వెడల్పుకు, గడ్డి జాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. ఆయా మందులను ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
నీటి యాజమాన్యం…
సోయాబీన్ వర్షాధార పంట. ఈ పంట మొలక దశ, పూత దశ, కాయ దశలో నీటి తడులివ్వాలి. ఆయా దశల్లో తప్పకుండా నీటి కొరత లేకుంటే అధిక దిగుబడిని సాధించవచ్చు. స్ప్రింక్లర్ పద్ధ్దతిలో పైరుకు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో నీరందించవచ్చు.
మెళకువలు పాటిస్తే అధిక దిగుబడి
సోయాబీన్ పంట సాగులో మెళకువలు పాటిస్తే అధిక దిగుబడిని సాధించవచ్చు. లైసెన్స్ పొందిన వ్యాపారుల వద్దనే నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి విత్తుకోవాలి. పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చీడపీడల నివారణ చర్యలు గురించి వ్యవసాయాధికారులు, విస్తరణ అధికారులకు తప్పక సంప్రదించాలి. ఈసారి న్యాల్కల్ మండలంలో 4315 ఎకరాల్లో సోయాబీన్ పంటసాగు చేసే అవకాశం ఉంది. జూలై 15వరకు సోయాబీన్‌ను సాగు చేసుకోవచ్చు.
– లావణ్య, వ్యవసాయాధికారి, న్యాల్కల్ (సంగారెడ్డి జిల్లా)