కోహీర్, నవంబర్ 19: వానకాలం అధిక వర్షాలు కురవడంతో పాటు తుపాన్‌తో ఎడతెరపి లేని వానలు కురిసి అనేక పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం విభిన్న పంటల సాగుకు ప్రసిద్ధి. ఈ మండలంలో రైతులు సోయాబీన్, పత్తి, మినుము, పెసలు,ఆలుగడ్డ, పసుపు తదితర పంటలు సాగుచేస్తారు. ఈసారి అధిక వర్షాలకు రోజుల తరబడి చేనుల్లో వర్షపు నీరు నిలిచి మొక్కలు ఎదగక ఆశించిన దిగుబడి రాలేదు. దీంతో రైతులకు పెట్టుబడులు సైతం రాని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత సీజన్లో 70నుంచి 90రోజుల్లో పంట చేతికి వస్తుందని ఆలుగడ్డను ప్రస్తుతం రైతులు సాగుచేస్తున్నారు.
కొంతమంది రైతులు నెల క్రితం తమ పొలాల్లో దుక్కులు దున్నారు. స్థానికంగా ఆలు విత్తనాలు లభించక పోవడంతో సుమారు 2 వేల కిలోమీటర్ల దూరంలోని ఆగ్రా, జలంధర్‌కు వెళ్లి విత్తనాలు తీసుకువచ్చి పొలాల్లో నాటారు. మొలకలు ఏపుగా పెరుగుతున్నాయి. ముందుగా ఆలుసాగును ప్రారంభించిన రైతుల పొలాల్లో మరో 50రోజుల్లో పంట చేతికి రానున్నది. సరైన దిగబడి రావాలంటే సెప్టెంబర్ మొదటి వారంలో ఆలు విత్తనాలు విత్తుకోవాల్సి ఉంటుంది. కానీ, కొంతమంది రైతులు ఇప్పుడు ఆలుసాగు పనులు ప్రారంభించారు. రెండు నెలల ఆలస్యంగా విత్తనాలు విత్తుకుంటుండడంతో వాతావరణం అనుకూలిస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉంది.
చలి, భూమిలో తేమశాతం అధికంగా ఉంటేనే ఆలుగడ్డలో ఆశించిన దిగుబడి వస్తుంది. కానీ, చలికాలం మరో రెండు నెలలు ఉండే అవకాశం ఉండడంతో ఆలు సాగుచేసే రైతులు దిగుబడి రాక నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోహీర్ మండలంలోని కవేలి, దిగ్వాల్, పీచెర్యాగడి, వెంకటాపూర్, బిలాల్పూర్, మాచిరెడ్డిపల్లి, మనియార్‌పల్లి, తదితర గ్రామాల్లో 3వేల ఎకరాలకు పైగా ఆలు సాగుచేస్తున్నారు. రైతులు ఏ సమయంలో ఏపంట సాగు చేయాలో.. అధిక దిగుబడికి ఎలాంటి మెళకువలు పాటించాలి తదితర విషయాలు చెప్పే ఉద్యానశాఖ అధికారులు కరువయ్యారు. రైతులకు సూచనలు, సలహాలు అందించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులు సూచనలు చేయాలి…
ఏటా వానకాలం తర్వాత ఆలుగడ్డ పంట సాగు చేస్తాం. ఈ వానకాలం సీజన్లో ఆరు నెలలు వానలు పడ్డాయి. సరిగా భూమి కూడా ఎండలేదు. దుక్కులు కూడా కరెక్టుగా కాలేదు. కొంతమంది రైతులు నెలక్రితమే ఆలుగడ్డ విత్తనాలు విత్తుకున్నారు. ప్రస్తుతం వానలు తగ్గడంతో ఇప్పుడు పంట సాగుచేస్తున్నారు. ఇట్లయితే రైతులకు నష్టం కాదా..? అధికారులే చెప్పాలి.
– సత్యనారాయణరెడ్డి, రైతు, మనియార్‌పల్లి, కోహీర్ మండలం(సంగారెడ్డి జిల్లా)