కాంగ్రెస్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు రైతులను ఇబ్బంది పెట్టి నాణ్యమైన కరెంట్ ఇవ్వలేదు. ఇవ్వాళ కరెంట్‌పై ఆ పార్టీ కుట్రలు, కుతంత్రాలను స్వయంగా ఆపార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బయటపెట్టారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ను రద్దు చేస్తామని మాట్లాడుతున్నారు. రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు అన్న మాటలపై రైతాంగం భగ్గుమన్నది. ఉచిత విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలకు నిరసనగా మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. నేడు (బుధవారం) నిరసనలు చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. 24 గంటల కరెంట్‌ను ఉచితంగా ఇవ్వడంతో రైతులు పంటలు బాగా పండిస్తున్నారన్నారు.
– మెదక్/సంగారెడ్డి న్యూస్‌నెట్‌వర్క్
కాంగ్రెస్ రైతు వ్యతిరేకి..
మెదక్, జూలై 11 (నమస్తే తెలంగాణ): 24 గంటలు వద్దు.. 3 గంటలు చాలు అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గు చేటని, దీంతో ఆ పార్టీ నిజ స్వరూపం బయటపడిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మండిపడ్డారు. అమెరికా ఎన్ఆర్ఐల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలకు మెదక్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు మండిపడుతున్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ చీప్ ట్రిక్స్ చేస్తున్నదని, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాతే రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తున్నదన్నారు. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉచి త విద్యుత్, పంట పెట్టుబడి, సాగునీరు ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, ఓర్వలేకపోతున్న కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన రైతుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయం దండగ అన్నవాళ్లే ఇప్పుడు పండుగ అంటున్నారన్నారు. రైతాంగానికి బాధల నుంచి విముక్తి లభిస్తున్న తరుణంలో రేవంత్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో రైతులకు కనీసం ఏడు గంటల కరెంటు కూడా ఇవ్వలేకపోయిందని, ఇప్పుడు సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి మాటలకు నిరసనగా నేటి నుంచి మూడు రోజుల పాటు గ్రామా లు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
కాంగ్రెస్‌కు కరెంట్ షాక్ తప్పదు..
జహీరాబాద్, జూలై 11: ఉచిత కరెంట్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన మాటలకు కాంగ్రెస్‌కు రైతుల కరెంట్ షాక్ తప్పదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. వ్యవసాయనికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్‌పై అనుచితంగా మాట్లాడడం సరికాదని ధ్వజమెత్తరు. మంగళవారం జహీరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చేస్తున్న పథకాలు చూసి కాంగ్రెస్ వాళ్లు ఓర్వలేక అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. తెలంగాణలో పెరిగిన సాగును చూసి కాంగ్రెస్ విషం చిమ్ముతున్నారన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు తగ్గిన బుద్ధి చెబుతారన్నారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనంగా బుధవారం జహీరాబాద్ నియోజకవర్గంలో రైతు వేదికల ఎదుట రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలుపాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పాలనలో పల్లె కన్నీరు పెట్టింది
మెదక్ అర్బన్, జూలై11: రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ అవసరం లేదని మూడు గంటల కరెంటు సరిపోతుందన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పల్లెలు కన్నీరు పెట్టాయని నాటి పరిస్థితులను గుర్తుచేశారు. 24 గంటల ఉచిత కరెం టు రైతన్నకు ప్రాణాధారమన్నారు. ఉచిత విద్యుత్ తీసేస్తామనడం రైతులను ఆత్మహత్యలకు పురిగొల్పడమేనని విమర్శించారు. కార్పొరేట్ల బీజేపీ, కాంగ్రెస్ కొమ్ము కాసి రైతుల సంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేశాయన్నారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైతు బీమా, రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎరువుల కోసం షాపు ల వద్ద క్యూలైన్లో చెప్పులు పెట్టి వేచి చూసిన పరిస్థితులు కాంగ్రెస్ పాలనకు తార్కాణమన్నారు. ధరణి లాంటి భూ పరిపాలన వ్యవస్థను రద్దు చేస్తామని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే భవిష్యత్తులో రైతు బంధు, రైతు బీమా లాంటి విప్లవాత్మాక పథకాలు కూడా రద్దు చేస్తారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులను రైతులు ప్రశ్నించాలన్నారు.
టీఎస్‌హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్
సంగారెడ్డి, జూలై 11: తెలంగాణ రైతాంగంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, టీఎస్‌హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ ధ్వజమెత్తారు. మంగళవారం చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐలు రేవంత్‌రెడ్డిని అడిగిన ప్రశ్నలకు 24 గంటల కరెంటుకు బదులుగా 3 గంటలు ఇస్తే పరిపోతుందని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించా రు. తెలంగాణ రైతులపై రేవంత్‌కు విషం తప్ప విజన్ లేకుండా మాట్లాడుతున్నార న్నారు. రైతును దగా చేసేందుకే చౌకబారు మాటలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టుతోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. రూ.4 వేల పింఛన్లు, రూ.2 లక్షల రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేసి, అధికారంలోకి రావాలనే ఆతృతతో కాంగ్రెస్ నాయకులు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పెద్దలు రాహుల్, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు తెలంగాణ ప్రజలు, రైతాంగానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు.
రైతు వ్యతిరేకి అని రేవంత్ మాటల్లో తేటతెల్లం
వట్పల్లి, జూలై 11: రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై దిక్కుతోచక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆసత్యా ప్రచారాలు చేస్తున్నారని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. మండలంలోని కేరూర్ గ్రామంలోని పొలాల వద్దనున్న రైతులతో ఎమ్మెల్యే ముచ్చటించారు. 24 గంటల కరెంటుతో లాభం జరుగుతుందా.. అని ఎమ్మెల్యే ప్రశ్నించగా, రైతులు సంతోషంగా కేసీఆర్ సారు ఉచితంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నడు, రైతుల కష్టం తెలిసిన మనిషి అని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంటుతోనే వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందన్నారు. రైతులు అభివృద్ధికి కృషి చేయని కాంగ్రెస్ 24 గంటల కరెంటు గురించి మాట్లాడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి 4.5 లక్షల కోట్లు అందించారన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము లేక తపుఉ్పడు ప్రచారాలు చేస్తున్నరన్నారు. 3 గంటల కరెంటుతో పంటలు పండించే పద్ధతిని వివరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేతో వరం అధ్యక్షుడు వీరారెడ్డి ఉన్నారు.
రేవంత్‌కు వ్యవసాయమే తెల్వదు
మునిపల్లి, జూలై 11: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వ్యవసాయం అంటేనే తెల్వదని, ఆయన మాటలు చిన్నపిల్లలు కూడా నమ్మే పరిస్థితిలో లేరని బీఆర్ఎస్ మునిపల్లి మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం మునిపల్లిలో విలేకర్లతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి వ్యవసాయం అంటే ఎంటో.. ఎన్ని గంటలు కరెంట్ అవసరామో తెలుసా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రైతులకు అవసరమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగలా చేస్తుంటే కనిపించడం లేదా అన్నారు. సమావేశంలో మునిపల్లి సర్పంచ్ రమేశ్, రాయికోడ్ మార్కెట్ డైరెక్టర్ మల్లేశం, యూత్ అధ్యక్షుడు ఆనంద్ రావు ఉన్నారు.
మళ్లీ పదేండ్లు వెనక్కి నెట్టేస్తారా?
సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితో రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌తో ఇప్పుడిప్పుడే ధైర్యంగా పంటలు పండిస్తున్నాం. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటలే ఉచిత విద్యుత్ ఇస్తామని అవహేళన చేయడం సరికాదు. వ్యవసాయ రంగాన్ని మళ్లీ పదేండ్లు వెనక్కి నెట్టాలని చూస్తే ఊరుకోం. రైతులందరం కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతాం.
– కొత్తకుమ్మరి శ్రీనివాస్, రైతు, గూడురు, శివ్వంపేట
రైతుల కష్టాలు రేవంత్‌రెడ్డికి తెలియవు
రైతులు పడే కష్టాలు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఏం తెలుసని మాట్లాడుతున్నడు. కష్టాలు తెలిస్తే అలా మాట్లాడడు. రైతుల సాధక బాధలు పూర్తిగా తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. అందుకే రైతు సంక్షేమానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా అందిస్తున్నారు. రైతుల జోలికొస్తే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు.
-రైతు కొత్తకుమ్మరి కుమార్, గూడురు, శివ్వంపేట
మా బాధలు రేవంత్‌కు ఏమెరుక?
మట్టిలో బతికే రైతుల బాధలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఏమెరుక. వాళ్లకు ఫ్యాక్టరీలు, వ్యాపారాలు ఉన్నాయి. వాళ్లు బతుకుతరు. ఎవుసం సేసే మాలాంటోళ్లు ఎట్ల బతుకుతరు. కరెంట్‌కు పైసలు కట్టాలే, దీన్ని తీసేయాలని చెప్పుడు రైతు నోట్ల మట్టిపోసుడే. గిట్లాంటోల్లు సెయ్య బట్టే రైతు బతుకు అధ్వానమౌతున్నది. సీఎం కేసీఆర్ సెయ్య బట్టి పొలం కాడికి ఎప్పుడు పోయైనా కరెంట్ పెట్టుకునే సౌలత్ సేసిండు.
– సావుల మల్లేశం, రైతు, హుస్నాబాద్‌టౌన్
రైతు బాగుండడం వారికి ఇష్టంలేదు
రైతులు బాగుండాలని సీఎం కేసీఆర్ ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతుండు. పంటలు పండించాలంటే నీళ్లు అవసరమని ప్రాజెక్టులు కడుతుండు. సీఎం సార్ రైతుల కోసం 24 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాడు. గీ.. కాంగ్రెసోల్లు 24 కరెంట్ వద్దంటూ మాట్లాడుతుండ్రు. రైతులు బాగు పడటం వారికి ఇష్టం లేదు. ఇలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం.
– చౌదరిపల్లి తిర్మలయ్య, రైతు, నిజాంపేట