హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నాయకుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు న్యాయస్థానంలో ఊరట లభించింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. తనపై అన్యాయంగా నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ కాంతారావు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ మధుసూదరావు బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన యువతి చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపారు.
కాం తారావుకు అప్పటికే వివాహమైన విషయం ఫిర్యాదుదారుకు తెలుసని, అయినప్పటికీ ఆయనతో సంబంధం కొనసాగించినట్టు ఆమె చెప్తున్నారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వివాహమైనట్టు తెలిశాక కూడా సంబంధం కొనసాగిస్తే అది లైంగిక వేధింపుల కిందకు రాదని పేర్కొన్నారు. కాంతారావుతో నాలుగేండ్లుగా సహజీవనం కొనసాగించినట్టు చెప్తున్న ఫిర్యాదురాలు ఇంతకాలం తర్వాత ఫిర్యాదు చేయడానికి కారణమేంటని ప్రశ్నించారు. కాంతారావు రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే ఆమె తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేయించారని వాదించారు. ఈ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ.. కాంతారావుపై కేసును కొట్టివేశారు.