సిద్దిపేట, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం రేవంత్‌రెడ్డి సాబ్ ఎన్నికల ముందు ఏం చెప్పారు… ప్రతి రైతుకూ రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పితివి.. ఇప్పుడేమో ఏవేవో కొర్రీలు పెట్టి పంట రుణమాఫీ చేయకపోతివి.. రోజూ బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల వద్దకి పోవడితిమి.. వాళ్లేమో మాకు తెల్వదు.. మీ సీఎంను అడుక్కో పోండ్రి అనవట్టిరి. మరి ఎట్లా .? మాకు పంట రుణమాఫీ అయతదా..? కాదా..? మీది పైసలు కట్టమంటే అట్లా కూడా కడితిమి ..అట్లయినా మాకు రుణమాఫీ కాకపాయే ..మా పరిస్థితి ఏంటి అని ..? నాలుగు విడతల్లో పంట రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఏ గ్రామంలో చూసినా రైతులు తమ ఆవేదనను వెల్లబోసుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ రైతులను నిండా ముంచిందని, పంట రుణమాఫీ చేస్తానని ఎగ్గొటిందని రేవంత్ సర్కార్‌పై మండిపడుతున్నారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు విడతలుగా రుణమాఫీ చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. నాలుగో విడతలో సిద్దిపేట జిల్లాలో 9,063 మందికి, మెదక్ జిల్లాలో 7,248 మందికి, సంగారెడ్డి జిల్లాలో 11,301 మంది రైతులకు పంట రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
నాలుగు విడతల్లో మాఫీ కానీ రైతులు వేల మంది ఉన్నారు. వారికి కూడాపంట రుణమాఫీ చేసి కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వాళ గ్రామాల్లో ఎక్కడా చూసినా తమకు పంట రుణమాఫీ కాలేదంటూ రైతులు గోడు వెల్లబోసుకుంటున్నారు. రుణమాఫీ కాని వారు దరఖాస్తు చేసుకోమ్మంటే చేసుకున్నాం. ఇగ మాఫీ అయతది అనుకున్నాం.. కానీ ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్త లేదు. కేవలం కొంత మందికే చేసి చేతులు దులుపుకుంటుందని వారు ఆరోపిస్తున్నారు. రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న ప్రభుత్వం వెంటనే అందరికి రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ సర్కార్‌ను రైతులు డిమాండ్ చేస్తున్నారు. రేషన్ కార్డు ప్రమాణికంగా తీసుకున్న ప్రభుత్వం ఆ కుటుంబానికి రూ.రెండు లక్షలు అయితే మాఫీ చేయాలి కదా..? అలా ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రూ.రెండు లక్షల మాఫీ డబ్బులు రైతుల క్రాప్‌లోన్ అకౌంట్లో జమ చేస్తే ఆపైన ఉన్న డబ్బులు రైతులు కట్టి రుణాలు రెన్యూవల్ చేసుకుంటారు కదా.. అలా చేయకుండా కుంటిసాకులు చెబుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు పంట రుణమాఫీ డబ్బులను ఎగ్గొట్టాలనే పనిలో ఉందని రైతులు మండి పడుతున్నారు. యాసంగి సాగు ప్రారంభమయింది. ఇంత వరకు రుణమాఫీ లేదాయే… రైతు భరోసా లేదాయే అని రైతులు అంటుండగా, కాంగ్రెస్ నేతలు కూడా రుణమాఫీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న తమకు కూడా రుణమాఫీ కాకపోయే ఇదేమి ప్రభుత్వం అంటూ వారిలో వారే గుసగుసలాడుకుంటున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా రైతులను కాపాడుకుం టేనే భవిషత్తు ఉంటుందని పేర్కొంటున్నారు.
గుమ్మడిదల, డిసెంబర్ 3: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెసోళ్లు..పాసుబుక్ ఉంటే పంట రుణమాఫీ చేస్తామన్నారు. నేడు రేషన్‌కార్డుకు లింక్‌పెట్టి పంట రుణమాఫీని ఎగ్గొట్టడానికి కుట్రలు చేస్తున్నారు. గుమ్మడిదల మండలం నాగిరెడ్డిగూడెంలో నాకు 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దానిపై బ్యాంకులో రూ.లక్ష 80 వేలు పంట రుణం తీసుకున్న. మాది ఉమ్మడి కుటుంబం. మా ఇంట్లో నాలుగురికి నాలుగు పాసు పుస్తకాలు ఉన్నాయి. గతంలో పంట సబ్సిడీ కోసం ఎవరి పాసుపుస్తకం వారు చేసుకున్నాం. ఎవరి పొలానికి వారు పంట రుణం తీసుకున్నాం. అప్పడు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి రైతుకు పంట రుణం మాఫీ చేస్తామన్నారు. రేషన్ కార్డు అందరికీ కలిసి ఒక్కటే ఉంది. ఉన్న నాలుగురికి కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పుడు రేషన్‌కార్డు ఒక్కటికే అని కొత్త మెలిక పెట్టారు. గతంలో కేసీఆర్ పంట పొలం మీద తీసుకున్న గోల్డ్ లోన్‌కు, పంట లోన్‌కు కూడా మాఫీ చేసిండు. ఇప్పుడు గోల్డ్‌లోన్‌కు వర్తించదని అంటున్నారు. ఇక జనవరిలో సంక్రాంతి తర్వాత రుణమాఫీ అని రైతులను మభ్యపెడుతుంది రేవంత్ సర్కార్. ఇదంతా రైతులు తీసుకున్న రుణాలను ఎగ్గొట్టడానికే అని తెలుస్తుంది. రైతులను నట్టేటా ముంచుతున్న సర్కారుకు రైతుల నుంచి తగిన గుణపాఠం తప్పదు.
– గడ్డం హన్మంత్‌రెడ్డి, రైతు, నాగిరెడ్డిగూడెం, గుమ్మడిదల మండలం, సంగారెడ్డి జిల్లా
రామాయంపేట, డిసెంబర్ 3: కాంగ్రెస్ సర్కార్ నాలుగు విడతలు పంట రుణమాఫీ చేసినమని చెబుతున్నా.. నాకు ఇంతవరకు పంట రుణమాఫీ కాలే… రామాయంపేట మండలం ఝాన్సిలింగాపూర్ గ్రామంలో నాకు, నా భార్యకు కలిసి మొత్తం 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. నా భార్య సునీత పేరిట ఎకరం 20గుంటలు, నా పేరిట ఎకరం 36 గుంటల భూమి ఉంది. మా ఇద్దరి పేరిట మంజీరా బ్యాంకులో నా పేరిట రూ.లక్ష 35 వేలు, నా భార్య పేరిట రూ.లక్ష 78వేలు అప్పు ఉంది. ప్రభుత్వం ఇన్ని విడతలు పంట రుణమాఫీ చేసిన మాకు కాలేదు. బ్యాంకు వారిని, వ్యవసాయ శాఖ అధికారులను ఎన్నిసార్లు అడిగినా వచ్చే విడతలో వస్తుంది.. అంటూ దాటవేస్తున్నారు. తిరిగి తిరిగి చెప్పులు అరిగినయ్ తప్ప… మాకు ఒక్కపైసా కూడా రుణమాఫీ కాలేదు. ఇవ్వాల, రేపు అంటూ అధికారులు జరుపుతున్నారు. మాకు పంట రుణమాఫీ అయితదని నమ్మకం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వమే సక్కగుండె.
– బానప్పగారి నర్సారెడ్డి, రైతు, ఝాన్సిలింగాపూర్, రామాయంపేట మండలం, మెదక్ జిల్లా
కొమురవెల్లి, డిసెంబర్ 3: కొమురవెల్లిలోని ఏపీజీవీబీలో ఆరేండ్ల క్రితం రూ.లక్ష వరకు రుణం తెచ్చుకున్నా. ప్రతి ఏడాది రెన్యూవల్ చేస్తున్నా. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రైతులకు రూ.2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పడంతో ఆశతో చూసిన. కానీ నా పేరు మూడు విడతల పంట రుణమాఫీ లిస్ట్‌లో రాలేదు. బ్యాంకుకు వెళితే అప్పు రూ.2 లక్షల 5వేలు ఉందని, 5వేలు కట్టమన్నారు. 5వేలు కట్టినా, నీ పేరు పైకి పంపుతమన్నారు. ఏమైనా తప్పులు ఉన్నవి సరిచేసి 4వ విడతలో విడుదల చేస్తామంటే కచ్చితంగా రుణమాఫీ అయితది అనుకున్నా, కానీ నాలుగో లిస్ట్‌లో కూడా నా పేరు లేదు. ఇంకా రుణమాఫీ పూర్తయిందని సీఎం రేవంత్ సార్ అంటుండు. ఏ ఊర్లో ఎంతమందికైందో కానీ, మా ఊర్లో మాత్రం నాలాంటి రుణమాఫీ కానివాళ్లు 20 మందికి పైగానే ఉన్నారు. ప్రభుత్వం రుణమాఫీని ఏ లెక్కన పరిగణలోకి తీసుకుందో కానీ, చాలామందికి రుణమాఫీ జరుగలేదు. ప్రభుత్వం చెప్పిన మాటలు చేతల్లో చూపడం లేదు.
– బచ్చల రమణ, మహిళా రైతు, గురువన్నపేట, కొమురవెల్లి మండలం, సిద్దిపేట జిల్లా