హత్నూర, జూన్ 16 : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ముచ్చర్ల గ్రామశివారులోని ఎన్ఎసీఎల్ బెల్టెక్ పరిశ్రమ వద్ద శనివారం రాత్రి కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం… సాదుల్లానగర్‌కు చెందిన చెక్కల మహేశ్(30) కొంతకాలంగా పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. మహేశ్ రోజు మాదిరిగానే శనివారం రాత్రి పనికోసం పరిశ్రమ వద్దకు వెళ్లాడు. మద్యంతాగి వచ్చాడని బెదిరించడంతో పాటు బైక్తాళాలు లాక్కుని తోటి కార్మికుల ఎదుట అతడిని అవమానపరిచారు. ఈ అవమాన భారం భరించలేక తీవ్ర మనస్తాపంతో పరిశ్రమ ఎదుట గల విద్యుత్ స్తంభం ఎక్కి కరెంట్ తీగలను పట్టుకోవడంతో షాక్‌కు గురై మహేశ్ కిందపడి మృతిచెందాడు.
విషయం తెలుసుకున్న కుటుంబీకులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఆందోళన చేశారు. మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిన్నారం సీఐ సుధీర్‌బాబు, హత్నూర, గుమ్మడిదల ఎస్సైలు సుభాష్, మహేశ్వర్‌రెడ్డి తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు, గ్రామస్తులు పరిశ్రమ ప్రతినిధులతో చర్చలు జరిపి బాధిత కుటుంబానికి రూ. 11లక్షల ఆర్థికసాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి తల్లిదండ్రులు సామయ్య, మంగమ్మ, భార్య ప్రమీల, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.