సిద్దిపేట,సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామాల్లో కోడి కూయకముందే మద్యం ఏరులై పారుతున్నది. ఊరూరా ఎంత లేదన్నా (చిన్న గ్రామం అయి తే) నాలుగు నుంచి ఐదు బెల్ట్‌షాపులు కొనసాగుతున్నాయి. పెద్ద గ్రామాలు ఐతే రెట్టిం పు స్థాయిలో నడుస్తున్నాయి. అడ్డుకునే వారే అండదండలు అందించడం తో గ్రామాల్లో జోరుగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. వైన్స్ యజమానుల కనుసన్నల్లో ఈ బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. వైన్స్ షాపులు, బెల్ట్ షాపుల కేంద్రంగా కల్తీ మద్యం అమ్ముతూ అందినకాడికి దోచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైన్స్‌లో కల్తీ మద్యం అమ్ముతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని గ్రామాల్లో మద్యం యథేచ్ఛగా అమ్ముతున్నారు.
పోలీసులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు వైన్స్ యజమానులు, బెల్ట్‌షాపుల నుంచి ప్రతి నెలా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెలా వైన్స్ యజమానులు, బెల్ట్‌షాపు దుకాణాలు నిర్వహించే వారి నుంచి వసూలు చేయడానికి ప్రత్యేకంగా పోలీసు, ఎక్సైజ్‌శాఖలో ఒక టీం ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వైన్స్‌లో కల్తీ మద్యం అమ్ముతున్నారా..? మంచిదే నా..? అని కనీసం చూడడం లేదు. పూర్తిగా ఎక్సైజ్‌శాఖ అధికారులు మామూళ్లకే పరిమితమయ్యారు తప్పా మరోటి లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మామూళ్లతో ఎక్సైజ్‌శాఖ అధికారులకు కాసుల వర్షం కురుస్తున్నది.
సిద్దిపేట జిల్లాలో 93 మద్యం దుకాణాలు, మెదక్ జిల్లాలో 49, సంగారెడ్డి జిల్లాలో 102 వైన్‌షాపులు నడుస్తున్నాయి. ఈమద్యం దుకాణాల యజమానులు నిబంధనలను గాలికి వదిలేశారు. ఎక్సైజ్శాఖనే తమ జేబులో ఉంది, ఇక నిబంధనలు అమలు చేసేది ఏం దీ అంటూ యథేచ్ఛగా కల్తీ మద్యం అమ్ముతున్నారు. మద్యం దుకాణాలు ఉదయం 10గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలి కానీ నిబంధనలు అతిక్రమించి రాత్రి వరకు తెరిచి ఉంటున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉన్నప్పుడు వైన్స్‌లను బం ద్ చేయాలి కానీ పక్కనే చిన్నపాటి రూమును కిరాయికి తీసుకొని అందులో మద్యం ఉంచి అమ్ముతున్నారు.
మద్యం దుకాణం ముందు ఇష్టారీతిగా వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఆరహదారి గుండా పోయేవారికి తీవ్ర ఇబ్బంది ఎదురవుతున్నది. ప్రతి మద్యం దుకాణానికి ఒక గదిని మద్యం తాగడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అక్కడ గది లేకపోతే మద్యం కొనుగోలు చేసి తీసుకొని పోవాల్సి ఉంటుంది. కానీ మద్యం ప్రియులు రోడ్డు మీదనే తాగేస్తూ బాటసారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మద్యం దుకాణాల ముందు ఏం జరుగుతుంది అనే విషయాన్ని పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు.
సాయంత్రం అయిందంటే చాలు మద్యం దుకాణాలు జాతరను తలపిస్తున్నాయి. రాత్రి 10 తర్వాత మద్యం విక్రయాలను బెల్ట్‌షాపుల ద్వారా వైన్స్ యజమానులు నిర్వహిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలకు సైతం మద్యం అమ్ముతున్నారు. అనేకచోట్ల రోడ్ల వెంట ఉన్న దుకాణా ల్లో మద్యం కొనుగోలు చేసి రోడ్లపైనే తాగేస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. బెల్ట్‌షాపుల్లో క్వార్టర్‌కు రూ.30 నుంచి రూ.40 వరకు, ఆఫ్ బాటిల్‌కు రూ.60, ఫుల్ బాటిల్‌కు రూ.100 పైనే వసూలు చేస్తున్నారు. మద్యాన్ని బట్టి అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్రామాల్లో బెల్ట్‌షాపులు నిర్వహించే వారు రోజూ ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా లక్షల్లో మద్యాన్ని తరలించి అధిక ధరలకు అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. వైన్స్‌షాపు యజమానుల పర్యవేక్షణలో బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వైన్స్ యజయానులే గ్రామాల్లో మద్యం దుకాణాలు పెట్టించి దందా కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుంచే రకరకాల కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారు. వివిధ బ్రాండ్లకు చెందిన వాటికి సీల్ యథావిధిగానే ఉంటుంది. ఆసీల్ పాడవకుండా విప్పి దాంట్లో కల్తీ మద్యం నింపుతున్నారు. ఈ దందా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జోరుగా జరుగుతోంది.
ఇదంతా తెలిసినా తమకు ఏంతెలియదు అన్నట్లుగా ఎక్సైజ్‌శాఖ అధికారులు వ్యవహరిస్తున్నా రు. వీరికి ప్రతి నెలా అందాల్సిన మాముళ్లు అందుతున్నాయి. ఇక వారికి ఏంపని అన్నట్టుగా ఉంది. బెల్ట్‌షాపులకు ఎలాంటి అనుమతి ఉండదు. ఇంకాస్త ముం దుకు వెళ్తే మరి కొన్ని చోట్ల వింతగా ఉంది..బెల్ట్‌షాపులపై మండల కేంద్రం, పట్టణాల్లో ఉన్న వైన్స్ వ్యాపారుల నిబంధనలు విధిస్తున్నారు. జిల్లాలోని ఒక మం డల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో కొనసాగుతున్న బెల్ట్‌షాపులు అదే మండలంలో ఉన్న వైన్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి గ్రామాల్లో విక్రయించుకోవాలి.
దీనికి భిన్నంగా ఎవరైనా బెల్ట్‌షాపు నిర్వాహకుడు మరో మండలంలో మద్యం కొనుగోలు చేసి తన షాపులో విక్రయిస్తున్నట్లు తెలిస్తే వైన్‌షాపుల నిర్వాహకులు వారిని ఎక్సైజ్ పోలీసులకు పట్టించి కేసులు నమోదు చేయిస్తున్నారు.ఎక్కడి మందు తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్నారనే విషయాలు తెలుసుకునేందుకు వైన్‌షాపుల వారీగా ఒక్కో రైడింగ్ టీం ఏర్పా టు చేసి సదరు టీం ద్వారా మద్యం షాపుల వారు వ్యాపారం కొనసాగిస్తున్నారు.బెల్ట్‌షాపుల వారు మం డల కేంద్రంలో ఉన్న షాపు నుంచి మద్యం కొనుగోలు చేసి అమ్మకపోతే వారిని ఎక్సైజ్ శాఖ అధికారులకు వైన్షాపువారు పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.