హుస్నాబాద్, జనవరి 2:ప్రభుత్వ భూమిపై రియల్టర్ల కన్ను పడింది. సిద్దిపేట జిల్లా హుస్సాబాద్‌లో విలువైన ప్రభుత్వ భూమికి సంబంధించి తప్పుడు సర్వే నంబరు చూపించి ప్లాట్లు చేసి విక్రయించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. కొన్ని రోజులుగా భూమిని కబ్జా చేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ భూమిని చదును చేసి అం దులోని చెట్లను సైతం నరికివేసి మట్టి పోశారు. ఇందులో ఎలాంటి పనులు చేపట్టవద్దని మున్సిపల్ అధికారులు పెట్టిన హెచ్చరిక బోర్డులను సైతం పీకివేసి స్థలాన్ని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ స్థలంలోని భూమిని ప్లాట్ల రూపంలో విక్రయించినట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు వారిపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. సదరు రియల్టర్లకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని, వారి ప్రోత్సాహంతోనే సుమారు రూ.5 కోట్లకుపైగా విలువైన భూమిని కబ్జా చేసి విక్రయించేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హుస్నాబాద్ శివారు కరీంనగర్ రోడ్డులోని టీఎస్ మోడల్ స్కూల్ భవనాన్ని ఆనుకొని ఉన్న సుమారు ఐదెకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉంది.
తప్పుడు సర్వే నంబర్‌తో పట్టాలు చేసేందుకు సన్నాహాలు..
హుస్నాబాద్‌లోని టీఎస్ మోడల్ స్కూల్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని తప్పుడు సర్వే నంబరు వేసి ప్లాట్లుగా చేసి విక్రయించేందుకు రియల్టర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరికి పట్టాలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సర్వేనంబర్ 93లో 24.13ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో టీఎస్ మోడల్ స్కూల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మినీస్టేడియం, శ్మశాన వాటిక, గిరిజన బాలికల వసతిగృహం నిర్మించారు. ఇందులో మోడల్ స్కూల్ ప్రహరీని ఆనుకొని కొంత స్థలం ఖాళీగా ఉంది.
ఈ సర్వేనంబర్ పక్కనే 62 సర్వే నంబరులో గల పట్టాభూమి ఉంది. ఖాళీ స్థలం 62 సర్వే నంబరు పరిధిలోకి వస్తుందని కొనుగోలుదారులను, అధికారులను నమ్మించి రిజిస్ట్రేషన్లు చేయించేందుకు రియల్టర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఖాళీ స్థలంలోని చెట్లను నరికి కాల్చివేసి చదును చేయించారు. టిప్పర్లతో మట్టిని పోస్తుండగా మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. గతంలో చదును చేస్తున్న సమయం లో ఈ స్థలం మున్సిపల్ పరిధిలోకి వస్తుందని, ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టవద్దని హెచ్చరిక బోర్టులు పెట్టినప్పటికీ రాతలపై తెల్లరంగు పూసి మరీ కబ్జాకు యత్నిస్తున్నారంటే వీరికి ఎవరి అండ ఉందో తెలుస్తోం ది. ఇప్పటికైనా 93సర్వే నంబరులోని 24.13ఎకరాల ప్రభుత్వ భూమిలో మిగులు భూమి సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
స్థలాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ స్థలాన్ని హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్‌గౌడ్, రెవెన్యూ సర్వేయర్ లక్ష్మీనారాయణతో కలిసి గురువారం పరిశీలించారు. స్థలంలో మోడల్ స్కూల్ ప్రహరీకి రాసిన హెచ్చరిక బోర్డును తొలిగించడం, టిప్పర్లతో పోసిన మట్టి కుప్పలు, రియల్టర్లు నరికివేసిన చెట్లను పరిశీలించారు. 93సర్వేనంబరు హద్దులు, ఇందులో ఉన్న భూమి మొ త్తం ఎంత ఉందో వెంటనే సర్వే చేసి చెప్పాలని సర్వేయర్‌ను ఆదేశించారు. తహసీల్దార్‌తో మాట్లాడి 93సర్వే నంబరుతో పాటు 62సర్వేనంబర్లపై వెంటనే సర్వే చేయించాలని కోరారు.
భూమిని స్వాధీనం చేసుకుంటాం
అనుమతులు లేకుండా స్థలాన్ని చదు ను చేయడం, హెచ్చరిక బోర్డులు తొలిగించడం చట్టరీత్యా నేరం. ఇందుకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం. ఈ స్థలం రెవెన్యూ పరిధిలో ఉన్నందున పూర్తిస్థాయిలో సర్వే చేయించిన అనంతరం స్వాధీనం చేసుకొని స్థలానికి ఫెన్సింగ్ వేయి స్తాం. స్థలం సర్వే పూర్తయ్యే వరకు ఈ స్థలంలో ఎలాంటి పనులు చేసినా అడ్డుకోవాలని, పనులు చేసేందుకు యత్నిస్తున్న వారిని గుర్తించాలని మున్సిపల్ అధికారులు, సిబ్బందిని ఆదేశించాం.
– మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ హుస్నాబాద్