మెదక్, మార్చి 18(నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒకరూ సహకరించాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్ కోరారు. సోమవారం కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ బాలస్వామితో కలిసి ఎన్నికల నిర్వహణపై ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని, మెదక్ పార్లమెంట్ స్థానం పరిధిలో సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయని తెలిపారు. ఈ సెగ్మెంట్ల పరిధిలో తుది ఓటరు జాబితా ప్రకారం 18,12,858 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో మెదక్ నియోజకవర్గంలో 2,16,748 మంది ఓటర్లు, నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 2,26,154 మంది, సిద్దిపేట నియోజకవర్గంలో 2,36,474 మంది, సంగారెడ్డి నియోజకవర్గంలో 2,47,338 మంది, పటాన్చెరు నియోజకవర్గంలో 4,07,419 మంది, దుబ్బాక నియోజకవర్గంలో 1,99,236 మంది, గజ్వేల్ నియోజకవర్గంలో 2,79,489 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. 2098 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయని, 240 మంది సెక్టార్ ఆఫీసర్లు, రూట్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఓటర్లు జాబితాలో తమ పేరు సరిచూసుకోవాలని, పేరు లేని వారు ఏప్రిల్ 15 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని సూచించారు. అవసరమైన మేర పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఓటర్‌కు రెండు కిలోమీటర్ల రేడియస్‌లో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని పేరొన్నారు.
మేర బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తయిందని, పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తిచేస్తామన్నారు. కోడ్ అమలులోకి వచ్చిందని, మతం, కులం, ప్రాంతంపై విద్వేశాలు పెంచేలా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడడం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు ఇస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలులేదని చెప్పారు. రాజకీయ సమావేశాలు ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థనా స్థలాల్లో, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించరాదని కలెక్టర్ సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిషరించేందుకు జిల్లాలో ఎంసీసీ, సర్వేలెన్స్ బృందాలు, ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు, వీడియో సర్వేలెన్స్ బృందాలు, ఎంసీఎంసీ కమిటీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఫిర్యాదులను ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 1950, సి-విజల్ యాప్ ద్వారా చేయవచ్చని కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదులు స్వీకరించేందుకు 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, సి-విజల్ యాప్‌లో లైవ్ వీడియో అప్లోడ్ చేసిన 100 నిమిషాల్లో అధికారులు క్షేత్రస్థాయికి చేరుకుని ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో 24గంటల వ్యవధిలో, బస్టాండ్, రైల్వేస్టేషన్, పెట్రోల్ బంక్ మొదలైన పబ్లిక్ ప్లేస్ల్లో 48 గంటల వ్యవధిలో, అనుమతి లేని ప్రైవేట్ స్థలాల్లో 72 గంటల వ్యవధిలో పూర్తిస్థాయిలో తొలిగిస్తామని కలెక్టర్ తెలిపారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ముద్రించే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ ఫోన్‌నెంబర్, ఎవరు ప్రింట్ చేయమన్నారో వారి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా పేరొనాలని, ఈ అంశాన్ని అన్ని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి, వివరిస్తామని కలెక్టర్ తెలిపారు.
మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అక్రమ నగదు, లికర్ సరఫరా జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, 24 గంటల పాటు నిఘా ఉంచామని తెలిపారు. రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణించవద్దని, ప్రతిరోజు తనిఖీల్లో జప్తు చేసిన సొమ్మును జిల్లాలో ఏర్పాటు చేసే గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామని, ఆధారాలు సమర్పించి గ్రీవెన్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని మెదక్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో మెదక్ ఎస్పీ బాలస్వామి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా, ఎన్నికల నియమావళిపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఉల్లంఘనలకు పాల్పడరాదని సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు తమ ప్రచార వివరాలు తెలియజేయాలన్నారు. కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, ఎన్నికలకు సంబంధించిన ఉల్లంఘనలు, సందేహాలు ఉంటే సంప్రదించాలన్నారు. ప్రభుత్వ ఆస్తులపై ఎలాంటి ప్రచార సంబంధిత అంశాలు ఉండరాదన్నారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఓటరు జాబితాలు అందిస్తామన్నారు. ఏఆర్వో, ఎన్నికల అధికారుల అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి రూ.95 లక్షల వరకు ఖర్చు పరిమితి ఉందని, ఖర్చుచేసే ప్రతి పైసా ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తీసి అందులో నుంచే ఖర్చు చేయాలన్నారు.
రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోని సహాయ ఎన్నికల పరిశీలకులు షాడో రిజిస్టర్లో నమోదు చేస్తున్న లెకలతో సరి చూసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార అనుమతుల కోసం కలెక్టరేట్లోని సువిధ సెల్‌కు లిఖిత పూర్వకంగా కనీసం 72 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలని, అన్ని అనుమతులు సువిధ ద్వారానే జరుగుతాయని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమించినట్లు సమాచారం ఉంటే ఫొటోలు, వీడియోలను ఈసీఐ కల్పించిన సీ-విజిల్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. ఎన్నికల ప్రసార ప్రకటనలు జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుంచి ముందస్తు ధ్రువీకరణ పొందాలని సూచించారు. సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ నుంచి గూడూరి ఆంజనేయులు, బీఆర్ఎస్ నుంచి చింతల నర్సింహులు, బీజేపీ నుంచి ఎంఎల్ఎన్ రెడ్డి, బీఎస్పీ నుంచి సిద్ధిరాములు, ఎంఐఎం నుంచి సయ్యద్ సాకేత్ అలీ, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.