అప్పు.. ముప్పు..!
ఉమ్మడి మెదక్ జిల్లా లోమైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు మితిమీరిపో తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలే లక్ష్యంగా వడ్డీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. స్థిరాస్తులుంటే వెంటనే లోన్ ఇప్పిస్తారు మైక్రో ఫైనాన్స్ ఏజెంట్లు. అవసరాల కోసం, పిల్లల చదువులు, వైద్య ఖర్చుల కోసం అప్పు తీసుకున్న కుటుంబాలు, వడ్డీల భారం మోయలేక, ఏజెంట్ల వేధింపులతో నరకయాతన పడుతున్నారు.
- మితిమీరిన మైక్రో ఫైనాన్స్ ఆగడాలు
- ఉమ్మడి మెదక్ జిల్లాలో వందల సంఖ్యలో వెలిసిన సంస్థలు
- సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అడ్డగోలుగా వ్యాపారం
- స్థిరాస్తులపై అప్పులిస్తూ కుటుంబాలపై వడ్డీల భారం
- ఏజెంట్ల వేధింపులతో బాధితుల నరకయాతన
- ఇప్పటికే పలువురి ఆత్మహత్య
ఉమ్మడి మెదక్ జిల్లా లోమైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు మితిమీరిపో తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలే లక్ష్యంగా వడ్డీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. స్థిరాస్తులుంటే వెంటనే లోన్ ఇప్పిస్తారు మైక్రో ఫైనాన్స్ ఏజెంట్లు. అవసరాల కోసం, పిల్లల చదువులు, వైద్య ఖర్చుల కోసం అప్పు తీసుకున్న కుటుంబాలు, వడ్డీల భారం మోయలేక, ఏజెంట్ల వేధింపులతో నరకయాతన పడుతున్నారు. వాయి దాలు కట్టలేని వారిపై భారీ వడ్డీలు, జరిమానాల భారం మోపుతూ మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. రుణాలు అవసరమే కానీ, వాటి పేరిట జరిగే వేధింపులు, అధిక వడ్డీల వసూలుపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సిద్దిపేట, జూన్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వందల సంఖ్యలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు వెలిశాయి. వడ్డీ వ్యాపారులు బ్రోకర్లను నియమించుకుని రుణాలిస్తున్నారు. అవసరం ఉన్న వారు బ్రోకర్ల కమీషన్, ఫైనాన్స్‌ల ప్రాసెసింగ్ ఫీజులు, పేపర్ చార్జిలు భరించే సరికి చేతికి అరకొర డబ్బులొస్తున్నాయి. దీంతో వచ్చిందే మహా భాగ్యం అంటూ పేదలు వారి ఉచ్చు లో పడుతున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని భారీగా వడ్డీలు వసూలు చేస్తున్నారు. స్థిరాస్తులు, పట్టా భూములను మార్టిగేజ్ చేసుకుని రుణాలు ఇస్తున్నారు. లోన్ ప్రాసెస్‌కు వివిధ రకాల పేపర్ల మీద అనేక సంతకాలు తీసుకుంటున్నారు. ఆ కాగితాలు ఏమిటో ప్రజలకు తెలియదు.
లోన్ తీసుకునే ముందు మైక్రో ఫైనా న్స్ వాళ్లు సంతకాలు పెట్టమన్న చోటపెట్టాలి. ప్రతి పేపర్ మీద భార్యాభర్తలు ఇద్దరివి సంతకాలు పెట్టించుకుంటున్నారు. ఉదాహరణకు రూ.6 లక్షల లోన్ ఇస్తే ప్రాసెస్, కాగితా లు, బీమా, మార్టిగేజ్ కమీషన్ అం టూ మొత్తంగా రూ.భారీగా వ సూలు చేస్తున్నారు. దీని కి తోడు వారితో ఇన్సురెన్స్కూడా చేయించుకుంటున్నారు. ఇవన్నీ పోను చివరకు రూ.4.50 లక్షలు చేతికి వస్తున్నాయి. ఇక ప్రతినెలా 5వ తేదీలోగా ఈఎంఐ కట్టకపోతే చెక్ బౌన్స్ చార్జీలు అదనంగా వేస్తున్నారు. ఏజెంట్లు ఇంటి ముందుకు వచ్చి వేధింపులు, ఎన్నో అవమానాలకు గురిచేస్తున్నారు. వీటిని తట్టుకోలేక పలు కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడ్డాయి.
పేదల అవసరమే వారికి ఆదాయం
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి రెండేండ్ల క్రితం అవసరాల నిమిత్తం తన స్థలాన్ని తాకట్టు పెట్టి సిద్దిపేటలోని మైక్రో ఫైనాన్స్‌లో రూ. 6 లక్షలు అప్పు తీసుకున్నాడు. ప్రతినెలా రూ.18 వేలు చెల్లిస్తున్నాడు. కొన్ని ఇబ్బందులతో కొన్ని కిస్తీలు కట్టలేదు. దీంతో ఆ సంస్థ ఏజెంట్లు వచ్చి అతడి ఇంటి ముందు నానా హంగామా సృష్టించారు. నంగునూరు మండలానికి చెందిన మరో వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో ఫైనాన్స్‌లో రూ.9 లక్షల అప్పు తీసుకున్నాడు. నెలకు రూ.22 వేలు కడుతున్నాడు. ఆలస్యమైతే చెక్ బౌన్స్ చార్జీల పేరిట అదనంగా వసూలు చేశారు.
సిద్దిపేట అర్బన్ మండలంలో మైక్రో ఫైనాన్స్ వేధింపులకు తాళలేక గతేడాది ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఇలాంటి ఘటనలు చాలా చోటుచేసుకుంటున్నాయి. వీటిని అరికట్టాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదనే విమర్శలున్నాయి. బ్యాంకుల్లో లోన్లు సులభంగా రాకపోవడం, అవసరాలు పెరగడంతో పేదలు మైక్రో ఫైనాన్స్‌ల వైపు మొగ్గుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఏజెంట్లు గ్రామాల్లో దందా సాగిస్తున్నారు. వందల సంఖ్యలో కార్యాలయాలు తెరుచుకున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలను ఆసరాగా చేసుకుని వారికి అవగాహన కల్పించకుండానే ఒప్పందాలు కుదుర్చుకుని అప్పులిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
సొంతంగా ఇల్లు ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుంటున్న మైక్రో ఫైనాన్స్ సంస్థలు, ఆస్తి పత్రాలు తీసుకుని రుణాలు ఇస్తున్నాయి. వాయిదాలు ఆలస్యమైతే ఇంటి ముందు కూర్చుని అవమానించడం, కుటుంబ సభ్యులపై ఒత్తిడి తేవడం, గ్రామంలో పరువు తీసేలా ఏజెంట్లు మాట్లాడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల డబ్బులు కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంటికి తాళం వేయడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆలస్యమైతే ఫెనాల్టీలు, అదనపు చార్జీలు, ఫీల్డ్ విజిట్ ఫీజుల పేరుతో మరింత భారం మోపుతున్నారు. పంట నష్టం వచ్చినా, ఈఎంఐ మాత్రం సమయానికి చెల్లించాల్సిందేనని సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయి.
- సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని మాచాపూర్‌లో గతేడాది ఓ ఫైనాన్స్ ఏజెంట్లు బాధితులను ఇబ్బందులకు గురిచేశారు. బాధిత కుటుంబంలో కొద్దినెలల్లో ఇద్దరు మృతి చెందడంతో ఈఎంఐలు కట్టడంలో ఆలస్యమైంది. ఇదేం పట్టించుకోకుండా సదరు ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు వారి వద్దకు వెళ్లి నానా హంగామా చేసి ఇంటికి తాళం వేశారు. కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. ఆ కుటుంబం ప్రస్తుతం రోడ్డు మీద పడింది.
- మెదక్ జిల్లా తూప్రాన్‌లో కొద్దిరోజుల క్రితం ప్రైవేట్ ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులు తాళలేక వివాహిత మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నది. అనారోగ్యంతో ఆమె కిస్తీలు కట్టడం ఆలస్యమైంది. దీంతో ఫైనాన్స్ ఏజెంట్లు ఆ కుటుంబంపై ఒత్తిడి చేశారు. ఇంటి ముందు గొడవకు దిగారు. ఈఎంఐ విషయంలో ఆమె భర్తతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నది.
- సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల్లోని చాలా గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. రుణాలు ఇచ్చేటప్పుడు ఒక లెక్క .. ఇచ్చిన తర్వాత మరో లెక్క చెబుతున్నారు. రుణాలు తీసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. అధిక వడ్డీలకు నలిగిపోతున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

