మెదక్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కంప్యూటర్ యుగంలో కూడా కులం పేరుతో దూషణలు..గ్రామ బహిషరణలు జరుగుతున్నాయి. దేవాలయానికి భూమి ఇవ్వాలని ఓ కుటుంబాన్ని కుల పెద్దలు గ్రామం నుంచి బహిషరించారు. గ్రామంలో ప్రతి ఏడాది జరిగే మల్లికార్జునస్వామి జాతరలో బోనాలు తీయవద్దని ఖరాఖండిగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్తే రానివ్వడంలేదని ఆ కుటుంబం రోదిస్తూ తెలిపింది. దీంతో బాధిత కుటుంబం శుక్రవారం మెదక్ కలెక్టరేట్లోని కలెక్టర్ రాహుల్రాజ్కు వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం ఆ కుటుం బం విలేకరులతో మాట్లాడుతూ…చేగుంట మండలం వల్లభపూర్ గ్రామానికి చెందిన బత్తుల లింగయ్యకు గ్రామంలోని మల్లికార్జునస్వామి దేవాలయం వెనుక భాగంలో సర్వే నంబర్ 209/26లో 11 గుంటల భూమి ఉంది. ఆ భూమిలో గత 25 ఏండ్లుగా కాస్తూ చేస్తూ సాగులో ఉంటున్నారు. కానీ ఆ 11గుంటల భూమిని దేవాలయానికి ఇవ్వాలని యాదవ సంఘం కులస్తులు ఆ కుటుంబంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
అంతేకాదు ఆ భూమిని చేగుంట సర్వేయర్, యాదవ సంఘం కులస్తులు కలిసి మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఏనక్ష ఆధారం లేకుండా మా భూమిలోకి వెళ్లి జేసీబీతో మా పంటలు, హద్దులు, పైపులైన్లను ధ్వంసం చేశారని, ఇదంతా ఎందుకు చేస్తున్నారని అడిగితే మీ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశామని సమాధానమిచ్చారన్నారు. గత మూడేండ్లుగా గ్రామంలోని మల్లికార్జునస్వామి జాతరలో బోనాలు తీయనివ్వలేదని వాపోయారు. భూమి ఇవ్వమని తెలిపినందుకు కుటుంబంపై కక్షకట్టిన కుల పెద్దలు ఏకంగా కుల బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. గ్రామంలో జరిగే కార్యక్రమాలకు ఆ కుటుంబాన్ని పిలువొద్దని, వారితో మాట్లాడొద్దంటూ హుకుం జారీ చేశారు. పిల్లలు పాఠశాలకు వెళ్తే వారితో తోటి పిల్లలు మాట్లాడకుండా చేశారని వాపోయారు.
బత్తుల లింగయ్యకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. తొమ్మిది మంది కుటుంబ సభ్యులతో కలిసి ఏడాదిన్నర క్రితం గ్రామాన్ని విడిచిపెట్టి చేగుంట మండలం నార్సింగిలో ఉంటున్నారు. మా సమస్యను గతంలో తహసీల్దార్లు, పీఎస్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఆగస్టు 5వ తేదీన జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని, వెంటనే రామాయంపేట సీఐ మా కులస్తులను పిలిపించి చెప్పినా వినడం లేదని తెలిపారు.