వెల్దుర్తి, జనవరి 30: వీరవనిత చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన మాసాయిపేటలో మంగళవారం చాకలి ఐలమ్మ విగ్రహాన్ని, ప్రాథమిక సహకార సంఘం దుకాణ సముదాయాన్ని, కొప్పులపల్లిలో మనఊరు-మనబడిలో భాగంగా రూ. 64.50 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి రాజిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ ఐలమ్మ భూస్వాములు, పెత్తందార్లకు వ్యతిరేకంగా కొట్లాడి మహిళలు, బహుజనుల హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయురాలు ఐలమ్మ అని కొనియాడారు. అలాంటి వీరవనిత ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అభినందనీయమన్నారు.
అంతకుముందు రజక సంఘం నాయకులు మాట్లాడుతూ 50 ఏండ్లు నిండిన రజకులకు పింఛన్లతో పాటు ప్రమాదబీమాను వర్తింపజేయాలని, ఐలమ్మ చరిత్రను పుస్తకాల్లో ముద్రించాలని సభలో ప్రస్తావించగా, స్పందించిన ఎమ్మెల్యే రజకుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 నుంచి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. వెల్దుర్తి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో దుకాణాలను నిర్మించడం అభినందనీయమని, ‘మనఊరు-మనబడి’ పథకంలో పాఠశాలలు మరింత అభివృద్ధి చెంది, అన్ని సౌకర్యాలు సమకూరుతున్నాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వరూపా నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, సర్పంచ్‌లు మధుసూదన్‌రెడ్డి, కనకమ్మ, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అనంతరెడ్డి, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, ఎంపీడీవో వెంకటలక్షమ్మ, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగుస్వామి, మండల అధ్యక్షుడు సోమేశ్, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.