జహీరాబాద్, జనవరి 6: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై అందరూ పెదవి విరుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నాటి ఓటర్ల జాబితానే వార్డుల వారీగా విభజించి ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించారు. వాటిలో పోలింగ్ కేంద్రాల వారీగా అనేక తప్పులు దొర్లాయి. జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డులు ఉండగా, 78,819 ఓటర్లు ఉన్నారు. వాటిలో 39,352 మంది పురుషులు, 39,647 మహిళా ఓటర్లు ఉన్నారు.
ఆయా వార్డులోని ఓట్లు మరో వార్డులోకి, ఒక బూత్ పరిధిలోని ఓట్లు మరో బూత్‌లోకి మారిపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల సంఖ్యలో ఓట్లు ఇతర వార్డులోకి వెళ్లిపోవడంతో తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఓటర్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ముసాయిదా ఓటర్ల జాబితాపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తప్పులు సరిచేయాలని కోరు తూ వందల సంఖ్యలో వినతి పత్రాలను అధికారులకు అందజేస్తున్నారు.
ఒకవార్డుకు చెందిన ఓటర్లు మరో వార్డులో కనిపించడం, కొందరికి రెండు ఓట్లు నమోదు కావడం వంటి లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. గ్రామాలకు చెందిన ఓటర్లు, మృతుల పేర్లు ఓటరు జాబితాలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఓటే కాకుండా పోలింగ్ బూత్‌లు మారిపోయాయని ఓటర్లు తెలిపారు. పెద్దసం ఖ్యలో ఓట్లు గల్లంతైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాంకేతిక తప్పిదమా, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమా తెలియడం లేదు. తగిన సమయం ఇవ్వకుండా ఎన్నికల సంఘం హడావిడిగా ముసాయిదా జాబితాను విడుదల చేయడంపై అన్ని పార్టీలు, ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మచ్చుకు కొన్ని ..
జహీరాబాద్ మున్సిపల్‌కు కమిషనర్‌తో పాటు పట్టణ ప్రణాళిక అధికారి. పలువురు ఉద్యోగులు ఇటీవల బదిలీపై వచ్చారు. వారికి మున్సిపల్ పరిధిలోని వార్డుల సరిహద్దులు, పోలింగ్ కేంద్రాలు, ఇంటి నంబర్లపై పూర్తిగా అవగాహన లేకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముసాయిదా ఓటరు జాబితాలో అనేక తప్పులు, ఒక వార్డు నుంచి మరో వార్డుకు, కొందరు ఓటర్ల పేర్లు గల్లంతవ్వడం, ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడం, జాబితా తప్పుల తడకగా మారింది.
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు భరత్‌నగర్‌కు చెందిన ఓట్లు 3,4,5,6, 27 వార్డులో నమోదయ్యాయి. 14వార్డుకు చెందిన 272 ఓట్లు 13 వార్డులోకి చేరాయి. 16, 23 వార్డులో కుప్పానగర్, రాయిపల్లి, కొన్యాల్, గుడుపల్లి, ఇప్పెపల్లి, జాడీమల్కాపూర్, వనంపల్లి, బూచినెల్లి గ్రామాలకు చెందిన ఓటర్లు, 34 వార్డులో కోహీర్, గుర్జువాడ, అనేగుంట, దిగ్వాల్, సంగారెడ్డి, బాలానగర్ ప్రాంతాలకు చెందినవారి పేర్లు నమోదు కావడం గమన్హారం. మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులో 100 వరకు ఇతర గ్రామాలు, పట్టణాలు, వార్డులకు చెందిన వారి పేర్లు కనిపించాయి. అధికారులు స్పందించి తప్పులు లేని ఓటరు జాబితాను తయారుచేసి తుది జాబితా ప్రకటించాలని నాయకులు, ప్రజలు కోరుతున్నారు.