హుస్నాబాద్ టౌన్, జనవరి 9: వచ్చిన నిధులకు రెండుసార్లు అట్టహాసంగా మంత్రి, ఉన్నతాధికారులు కలిసి శంకుస్థాపనలు చేశారు. కానీ, నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే వర్క్ ఏజెన్సీ వారు స్పందించడం లేదని ముక్తసరి సమాధానం ఇస్తున్నారు హుస్నాబాద్ బల్దియా అధికారులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణాన్ని ప్రగతి పథంలో తీసుకువెళ్లాలనే ఆశయం గొప్పదైనప్పటికీ, ఆచరణలో మాత్రం పనులు ముందుకు సాగని పరిస్థితి ఉంది. స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసినా పనుల్లో పురోగతి ఉండడం లేదు.
హుస్నాబాద్ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు మంజూరైన నిధులకు గతేడాది మార్చిలో ఒకసారి, వార్డుల వారీగా గతేడాది నవంబర్ 7న రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం, ్లకలెక్టర్ మనుచౌదరి శంకుస్థాపనలు చేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు టీయూఎఫ్ఐడీసీ కింద వార్డుకు రూ. 50 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. ఈ నిధులతో సీసీరోడ్లు, మురుగు కాల్వల పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులకు సంబంధించి ఆన్లైన్లో టెండర్లు పెట్టి వర్క్ ఏజెన్సీలకు సైతం అప్పగించి మూడు నెలలపైనే గడిచిపోయింది.
ఈ పనుల్లో 15 వార్డుల పనులను ఇన్ఫ్రా ఏజెన్సీకి అప్పగించగా, మరో 5వ వార్డుల్లో పనులను మరో వర్క్ ఏజెన్సీకి ఇంజినీరింగ్ అధికారులు అప్పగించారు. డిసెంబర్ 7న వార్డుల్లోని పలు పనులకు మంత్రి,కలెక్టర్ ఆధ్వర్యంలో శంకుస్థాపనలు చేశారు. ఈ పనులు త్వరితగతిన పూర్తిచేయాలనే ఆదేశాలు సైతం జారీచేశారు. కానీ, వర్క్ ఏజెన్సీలు పనులు చేపట్టేందుకు ముందుకే రావడం లేదు.ఇంజినీరింగ్ అధికారులు సంప్రదించినప్పటికీ స్పందించడం లేదని తెలుస్త్తోంది. ఈ విషయాన్ని ఇంజినీరింగ్ ఉన్నతాధికారులకు సమాచారం అందించిగా, వారు సంప్రదించినా ఫలితం కనిపించడం లేదు. పనులను ప్రారంభించాలని ఎంత ఒత్తిళ్లు చేసినా కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదని చెబుతున్నారని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. ఈ పరిస్థితిపై మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ జోక్యం చేసుకుని పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నోటీసులు జారీచేస్తున్నాం..
హుస్నాబాద్ పట్టణానికి టీయూఎఫ్ఐడీసీకి కెందిన మంజూరైన రూ.40 కోట్ల పను లు చేపట్టని వర్క్ ఏజెన్సీలకు నోటీసులు జారీచేస్తున్నాం. ఏజెన్సీల తీరుపై ఉన్నతాధికారులకు సమాచారం అందించాం. పలుమార్లు సంప్రదించినప్పటికీ ఏజెన్సీ వారి నుంచి స్పందన కనిపించడం లేదు.
– పృథ్వీరాజు, మున్సిపల్ ఏఈ