గజ్వేల్, డిసెంబర్ 6: బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా గజ్వేల్ ప్రాంతం పరిశ్రమల స్థాపనకు అనువుగా మారింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అందించిన సహకారంతో భూమిపూజ చేసిన భారీ పరిశ్రమలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలం బండతిమ్మాపూర్‌లో రూ. 2091 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన హిందుస్థాన్ లివర్ కోకాకోలా బేవరేజస్ కంపెనీ ఇటీవల పారంభమైంది. ఈ కంపెనీలో వేలాది మందికి ఉపాధి లభించనున్నది. కేసీఆర్ హయాంలో తునికి బొల్లారం, వర్గల్, బండమైలారం టీఎస్ఐఐసీ పార్కుల్లోనూ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించడంతో పారిశ్రామికవేత్తలు, కంపెనీలు ముందుకు వచ్చాయి.
రూ. వందల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అవన్నీ ప్రారంభం కానున్నాయి. దీంతో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణంతో నిర్వాసితులుగా మారిన భూబాధిత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్ ప్రాంతంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించింది.
ములుగు, వర్గల్ మండలాలు హైదరాబాద్‌కు అతి చేరువలో ఉండడం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేయూతనివ్వడంతో చాలామంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటును కేసీఆర్ ప్రోత్సహించారు. అందులో భాగంగా 2022లో బండతిమ్మాపూర్‌లో కోకాకోలా కంపెనీ పనులు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రారంభయ్యాయి. కోకాకోలా కంపెనీని 49ఎకరాల విస్తీర్ణంలో రూ.2091కోట్లతో అప్పట్లో భూమిపూజ చేశారు. ఇందులో సుమారు 1000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఈ కోకాకోలా పరిశ్రమకు కేసీఆర్ నిర్మించిన కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచే గోదావరి జలాలను వినియోగిస్తున్నారు. వర్గల్ మండలం అవుసులోనిపల్లి, వర్గల్, శాకారం గ్రామాల పరిధిలో 1200 ఎకరాల భూమిని పరిశ్రమల ఏర్పాటు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది. ఈ భూముల్లో బీఆర్ఎస్ హయాంలో పారాబాయిల్డ్ రైస్‌మిల్లులు, అమూల్ ఐస్‌క్రీమ్ కంపెనీ ఏర్పాటు పనులు అప్పట్లో ప్రారంభించారు. ఆ పనులు కొనసాగుతున్నాయి.త్వరలోనే ఇవి ప్రారంభం కానున్నాయి. దీంతో మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ములుగు, వర్గల్ మండలాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి లక్ష్యంగా పరిశ్రమల స్థాపనకు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎంతో కృషిచేశారు. ఆనాడు ముందుకొచ్చిన పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు భూమిపూజ చేయగా, నేడు ఆ పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా గజ్వేల్ నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమను కొత్తగా తేలేదు. గతంలో పరిశ్రమల ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం ముందుకొస్తే కాంగ్రెస్ నాయకులు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేయించి అడ్డుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేసులను ఛేదించి పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేస్తుందా లేదో చూడాలి.