సిద్దిపేట కమాన్, జూలై 16 : పట్టణవాసులు జంకుఫుడ్..బిర్యానీలు.. రోడ్డు పక్కన చేసే తినుబండారాలకు అలవాటు పడి ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు. అలా కాకుండా మార్కెట్లో సీజన్‌కు అనుగుణంగా లభించే పండ్లు తీసుకున్నైట్లెతే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యానికి మించిది మరేది లేదన్న సత్యాన్ని గ్రహించి ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పండ్లు కొనుగోలు చేయడం మంచిది. మార్కెట్లో పలువురు చిరువ్యాపారులు అల్లనేరేడు, జామ, మేడిపండు, మామిడి తదితర పండ్లను పట్టణవాసులకు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.
సిద్దిపేట పట్టణం ఎటు చూసినా అభివృద్ధి చెందింది. అల్లనేరేడు, జామ, మా మిడి తదితర పండ్లను సేకరించి చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు సిద్దిపేట పట్టణానికి నిత్యం తీసుకువచ్చి ఇక్కడ చిరువ్యాపారులకు విక్రయించి వెళ్లిపోతారు. వారు ప్రధాన రహదారుల్లో కూర్చు ని పట్టణవాసులకు అమ్ముతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎటు చూసినా అల్లనేరేడు పండ్లు కనబడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అల్లనేరేడు పండుపోషకాల గని.. తినడానికి రుచికరంగా ఉంటుంది. ఈ పండ్లు తినడం వల్ల వివిధ రకాల రోగాలను నియంత్రించుకోవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మూత్ర సం బంధ సమస్యలు ఉంటే ఉపశమనం కలుగుతుంది. మార్కెట్లో జామ పండ్లకు మంచి డిమాండ్ ఉన్నది. ఆరోగ్యాన్ని కాపాడడంలో జామ పండ్ల ప్రత్యేకతే వేరు. జామ పండ్లు తినడం వల్ల బ్లడ్‌ప్రెషర్, కొవ్వు తగ్గుతుంది. చర్మ సంబంధ వ్యాధుల నుంచి కాపాడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చుతుంది. కంటి చూపును కాపాడుతుంది. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది.
కుటుంబాన్ని పోషించుకుంటున్నా
రోజూ పండ్లు విక్రయిస్తా.. ఏ కాలం తీరు ఆ కాలం పండ్లు అమ్ముతా. రోజూ కైకిల్ పడేసుకుంటా.. వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గ్రామాల నుంచి వచ్చే రైతుల దగ్గర మాట్లాడి పండ్లు కొంటా.. వచ్చిన దానిమీద లాభం చూసుకుని అమ్ముతా. ఒక్కో సారి తొందరగా పండ్లు అమ్ముడుపోతాయి.
– షహాదాబేగం, చిరువ్యాపారి, సిద్దిపేట
గిరాకీ మంచిగనే ఉంది
పండ్ల వ్యాపారం చేస్తు న్నా.. రోజూ గిరాకీ మంచిగనే ఉంటది. తెలిసిన కస్టమర్లు నా దగ్గరే పండ్లు కొంటారు. తాజా తాజా పండ్లను తీసుకువచ్చి అమ్ముకుంటా. సీజన్ బట్టి పండ్లు విక్రయిస్తా.. పండ్ల అమ్మడం వల్ల గిట్టుబాటవుతుంది.
– పద్మ, చిరువ్యాపారి, సిద్దిపేట
పండ్లకే ప్రాధాన్యం
మా ఇంట్లో ఆరోగ్యాన్ని కాపాడే పండ్లకు ప్రాధా న్యం ఇస్తాం. మార్కెట్లో కూరగాయల కొనుగోలుకు వచ్చినప్పుడల్లా పం డ్లను తప్పకుండా కొనుగోలు చేస్తా. మంచి ఆరోగ్యానికి పండ్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఆల్బుకారా, అల్లనేరేడు ఇలా ఏవి కనబడితే అవి కొనుక్కుంటాం.
-అరుణ, సిద్దిపేట, కొనుగోలుదారురాలు