సిద్దిపేట, జనవరి 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక బుజ్జగింపులకు ప్రధాన పార్టీలు తెరతీశాయి.నామినేషన్లు వేసిన వారిలో ఎవరికి బీఫారమ్ దక్కుతుందోనన్న టెన్షన్ అన్ని పార్టీల్లో నెలకొంది. ఈనెల 3వ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండడంతో ప్రధాన పార్టీల నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బరిలో ఉండేదెవరో.. తప్పుకునేదెవరో వేచి చూడాల్సిందే. సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు, మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలకు, సిద్దిపేట జిల్లా లో 4 మున్సిపాలిటీలు, మొత్తం 19 మున్సిపాలిటీలకు ఈనెల 11న పోలింగ్ జరగనున్నది. అన్ని పార్టీలు తమ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసే పనిలో నిమగ్నమయ్యాయి. పోటీ తీవ్రంగా ఉన్నచోట సదరు నేతలను ఒప్పంచి పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలిపేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం పార్టీలు ప్రధానంగా పుర బరిలో నిలిచాయి. బీఆర్ఎస్ పార్టీ పక్కాగా టికెట్ల పంపిణీ చేసింది. గెలుపు గుర్రాలకు టికెట్టు ఖారారు చేసింది. చాలావరకు టికెట్ ఆశించిన వారిని సమన్వయం చేసి అందరి ఆమోదంతో టికెట్లు కేటాయించారు. కొన్నిచోట్ల పెద్దఎత్తున ఆశావహులు టికెట్లు ఆశించారు. పోటీ తీవ్రంగా ఉండడంతో ఆ వార్డులపై నేతలు దృష్టిసారించారు. టికెట్టు ఎందుకు ఇవ్వలేదో వివరించడంతో పాటు రాజకీయ సమీకరణల దృష్ట్యా టికెట్ రాలేదన్న విషయాన్ని వారికి వివరిస్తున్నారు. ఇతర పార్టీల్లో టికెట్టు రాని వారు స్వతంత్రంగా బరిలో ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు.అలాంటి వారిని గుర్తించి ప్ర ధాన పార్టీలు బుజ్జగిస్తున్నాయి. పోటీ నుంచి తప్పుకోమ్మని బుజ్జగిస్తున్నారు.
భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తామంటూ నేతలు సర్ది చెబుతున్నారు.ప్రధానంగా జనరల్ స్థానాలు, బీసీ జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. నామినేషన్ వేసిన వారిలో కొందరు ఎట్టి పరిస్థితుల్లో బరిలో ఉంటామని తెగేసి చెబుతున్నారు.ఈ విషయాన్ని తమ అనుచరుల ద్వారా సంకేతాలను పార్టీ నేతలకు పంపుతున్నారు. దీంతో ఎటూ పాలుపోక నేతలు తలలు పట్టుకుంటున్నారు. టికెట్ రాని కొందరు నేతలు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలావరకు పార్టీలు తమ అభ్యర్థులు ఖరారు చేశాయి. టికెట్ రాని వారిని బుజ్జగించి పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు నిలవాలని కోరుతున్నారు.నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుంచి పార్టీలు మారుడు, కండువాలు కప్పుకొనుడు ఎక్కువైంది. అధికార పార్టీ నుంచి వలసలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్లోకి వలసల జోరు రోజు రోజుకు పెరుగుతున్నది.
ప్రచారంలోకి అన్ని పార్టీలు…
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఆయా పార్టీలు తమ అభ్యర్థులు జాబితా ప్రకటించాయి. కొన్నిచోట్ల ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. పోటీతీవ్రంగా ఉన్న చోట పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఇక మున్సిపాలిటీల వారీగా ఖరారైన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఖరారు కావడంతో ప్రచారంలో బిజిగా మారారు. కేసీఆర్ పాలనలో పట్టణాల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలన గురించి ప్రజలకు బీఆర్ఎస్ అభ్యర్థులు వివరించి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.