మెదక్, మే 12 (నమస్తే తెలంగాణ): మెదక్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్‌కు యంత్రంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మెదక్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 18,28,210 మంది ఓటర్లున్నారు. ఇందులో 9,25,891 మంది మహిళలు, 8,92,656 మంది పురుషులు, ఇతరులు 209 మంది ఉన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మెదక్ ఎంపీ స్థానానికి 44 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 3 ఈవీఎంలు, ఒక వీవీ పాట్, ఒక కంట్రోల్ యూనిట్‌ను తరలించారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు సెగ్మెంట్లున్నాయి. మెదక్‌లో 277 పోలింగ్ కేంద్రాలు, నర్సాపూర్ 307, సిద్దిపేట 273, దుబ్బాక 253, గజ్వేల్ 322, సంగారెడ్డి 281, పటాన్చెరు 411 మొత్తం 2124 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు 2336 మంది పీవోలు, 2336 మంది ఏపీవోలు, 4672 వోపీవోలు, 166 మంది మైక్రో అబ్జర్వర్లు, 214 మంది సెక్టార్ ఆఫీసర్లు, 2124 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. 7,961 బ్యాలెట్ యూనిట్లు, 2,652 కంట్రోల్ యూనిట్లు, 2,970 వీవీ ప్యాట్లు ఉన్నాయి.
దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. వీల్చైర్లు, ర్యాంపులు నిర్మించారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్ సిద్ధం చేశారు. ఆశవర్కర్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ పోన్ అనుమతి లేదన్నారు.
పోలింగ్ పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సిబ్బందిదేనన్నారు. ఆదివారం మెదక్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఉదయం 5 గంటలకే మాక్ పోలింగ్ చేపట్టాలన్నారు. ఈవీఎంలకు సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే సెక్టార్ అధికారులు, రిటర్నింగ్ అధికారులకు నివేదించాలన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత నిబంధనల మేరకు సీల్ వేసి రిసెప్షన్ కేంద్రాల్లో అప్పగించాలని సూచించారు. పంపిణీ కేంద్రం నుంచి అధికారులు 277 పోలింగ్ కేంద్రాల్లో 28 రూట్లలో 61 బస్సుల్లో 1280 మంది సిబ్బంది పోలింగ్ సామగ్రితో తరలివెళ్లారు.
పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సమాచారం త్వరితగతిన అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందికి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆదివారం సిబ్బందితో మాట్లాడారు. సోమవారం పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం, ఓటర్ల హాజరు సమాచారం త్వరితగతిన ఉన్నతస్థాయి అధికారులకు అందించాలన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఓటర్ల హాజరు, పోలింగ్ శాతం, పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆర్డీవో రమాదేవి, డీఎస్పీ రాజేశ్, డీఈవో రాధాకృష్ణ, ఏవో యునాస్, ఎలక్షన్ సూపరింటెండెంట్ హర్దీప్సింగ్, ఈడీఎం సందీప్ పాల్గొన్నారు.