సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 23: సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. శనివారం జిల్లాలో పర్యటించిన ఆయన రానున్న ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు. సంగారెడ్డి, అందోల్ ఆర్డీవో కార్యాలయాలను సందర్శించి ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎస్ఎస్ఆర్-2025 ఓటరు నమోదు వివరాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఆర్డీవోలు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో ధరణి పెండింగ్ సమస్యలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తహసీల్దార్లతో ధరణి, ప్రజావాణి సమస్యలు, నూతన ఓటు నమోదు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియర్ అయ్యేలా చూడాలని సూచించారు.
చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను విధిగా కాపాడాలని, అక్రమ కట్టడాలపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టణాల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో డీఆర్వో పద్మజారాణి, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని పౌర సరఫరాల శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో ధాన్యం కొనుగోళ్లు, సీసీఐ పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు.