సంగారెడ్డి, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ):ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టలేని పరిస్థితి కాం గ్రెస్ ప్రభుత్వంలో నెలకొంది. కేసీఆర్ ప్రభుత్వం పాఠశాలల ఆధునీకరణకు పెద్దపీట వేసింది.‘మనఊరు-మనబడి’ కార్యక్రమం ద్వారా సంగారెడ్డి జిల్లాలోని 441 ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునీకరణ పను లు చేపట్టింది. రూ.36.90 కోట్లతో 363 గ్రామీణ, 78 పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునీకరణ పనులకు కేసీఆర్ సర్కార్లో శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనపై పెద్దగా దృషి పెట్టడం లేదు.
‘మనఊరు-మనబడి’ స్థానంలో కొత్తగా ‘అమ్మ ఆదర్శ పాఠశాలలు’ పేరుతో కార్యక్రమం ప్రారంభించినా పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభు త్వం ప్రభుత్వ పాఠశాలలకు నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఈజీఎస్ ద్వారా నిధులు ఇచ్చినా పనులు చేపట్టడం లేదు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా చెప్పుకొంటున్న అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు ఈజీఎస్ ద్వారా నిధులు ఇచ్చినా జిల్లాలో పనులు ప్రారంభం కావడం లేదు. బాలికల పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణానికి రూ.6.09 కోట్ల నిధులు ఇచ్చినా జిల్లా యంత్రాంగం ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు.
అధికారుల సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీలు, కిచెన్షెడ్లు, టాయిలెట్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం(ఈజీఎస్) కింద రూ.45.68 కోట్లతో 446 పనులు మంజూరు చేశారు. 132 పాఠశాలల్లో రూ.14.08 కోట్లతో ప్రహరీల నిర్మాణం, రూ.1.22 కోట్లతో కిచెన్షెడ్ల నిర్మాణానికి ఈజీఎస్ ద్వారా పనులు మంజూరయ్యాయి. రూ.4.29 కోట్ల తో 94 టాయిలెట్ల నిర్మాణ పనులు ఈజీఎస్లో చేపట్టాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు ఈ పనులు ప్రారం భం కాలేదు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల పరిధిలోని బాలికల పాఠశాలల్లో 174 టాయిలెట్ల నిర్మాణానికి ఈజీఎస్ ద్వారా రూ.6.09కోట్లు విడుదల చేశారు. దీంతో సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఈజీఎస్ ద్వారా మంజూరు చేసిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సైతం మోక్షం లభించ డం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో ఈజీఎస్ ద్వారా రూ.70.15 కోట్లతో 824 సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఈ పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఇంజినీరింగ్ అధికారుల ఆలసత్వం కారణంగానే ఈ పనులు అటకెక్కాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈజీఎస్ ద్వారా జిల్లాలోని రూ.8.4 కోట్లతో 105 అంగన్వాడీ భవనాలు నిర్మించాల్సి ఉన్నప్పటికీ పనులు సాగడం లేదు.
సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఈజీఎస్ ద్వారా రూ.95.83 కోట్లతో 1270 పనులు మంజూరయ్యాయి. వేర్వేరు కారణాలతో పనులు ఆశించిన స్థాయిలో వేగంగా సాగడం లేదు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 446 పనులు, 824 సీసీ రోడ్డు నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
-జ్యోతి, డీఆర్డీవో సంగారెడ్డి