దుబ్బాక,జూలై30: కూడవెల్లి రామలింగేశ్వరాలయంలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించి ఆలయానికి గొప్పవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట-భూంపల్లి మండలం కూడవెల్లి రామలింగేశ్వరాలయాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. ఆలయంలో రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో రామలింగేశ్వరాలయ అభివృద్ధిపై దేవాదాయశాఖ అధికారులు, పాలకవర్గం, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవాదాయశాఖ ఎస్ఈ ఓంప్రకాష్, ఏఈలు శ్రీధర్‌రెడ్డి, మారుతి, స్థపతి వల్లినాయక్తో దేవాలయ పునర్నిర్మాణం గురించి తెలుసుకున్నారు.
ఆలయానికి వచ్చే భక్తులకు వసతుల కల్పన తదితర వాటిపై సమావేశంలో చర్చించారు. బీఆర్ఎస్ హయాంలో ఆలయ నిర్మాణం పనులకు రూ.1.20 కోట్లు మం జూరు కాగా వాటిలో రూ.80 లక్షలతో పను లు చేపట్టిన కాంట్రాక్టర్ అర్ధంతరంగా వదిలేసినట్లు అధికారులు వివరించారు. ఈ విషయంపై సంబంధిత కాంట్రాక్టర్‌తో ఎమ్మెల్యే మాట్లాడారు. మిగిలిన రూ.40 లక్షలతో చేపట్టాల్సిన పనులు వేగవంతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచనల మేరకు దేవాదాయశాఖ అధికారులు దేవాలయ శివారులో నిర్మాణ పనులకు సంబంధించిన సర్వే పనులు చేపట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ… రామలింగేశ్వరాలయానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. ఇందుకు దేవాదాయశాఖ అధికారులు, పాలకవర్గం, అర్చకులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సొంత నిధులతో ఆలయ గర్భగుడిలో మరమ్మతులు, శివలింగానికి తాప్రం తొడిగింపు తదితర పనులు చేసినట్లు స్పష్టం చేశారు.
రామలింగేశ్వరాలయం పక్కనే ఉన్న పార్వతిదేవి, గణపతి , వేణగోపాలస్వామి, కాశీవిశ్వేశ్వర, వీరభద్రుడు, సంగమేశ్వర ఆలయాలకు మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు. ఇందుకు భారీగా నిధులు అవసరం ఉంటాయన్నారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు కొనసాగుతాయన్నారు.కూడవెల్లి త్రివేణి సంగమం ఒడ్డున వెలిసిన రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
దేవాలయానికి సంబంధించిన నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉన్నందున, ఆ స్థలంలో దేవాలయ అభివృద్ధికి, భక్తులకు వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. దుబ్బాక పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కైలాశ్, దేవాలయ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాజమౌళి, రవీందర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, కిషన్‌రెడ్డి, బండి రాజు, రవి, భాస్కర్, కృష్ణ, మల్లారెడ్డి, యాదగిరిరెడ్డి, స్వామి, శ్రీరాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు.