పెద్దశంకరంపేట, జూలై 15 : మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మేజర్ గ్రామపంచాయతీలో డంపింగ్ యార్డు లేకపోవడంతో సేకరించిన చెత్తను ఆరుబయట పడేస్తున్నారు. దీంతో దుర్వాసనతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్తా చెదారాన్ని సేకరించి జాతీయ రహదారి తిరుమలాపురం చెరువు కట్టపై పడేస్తున్నారు. పట్టణ ప్రజలు, రోడ్డుపై ప్రయాణించేవారు కంపుతో ముక్కు మూసుకోవాల్సి వస్తున్నది. రేగోడ్ వెళ్లే దారిలో చెత్త పారేసి అక్కడే తగలబెడుతున్నారు. దీంతో పొగ కమ్ముకుంటున్నది. అందులో నుంచి వస్తున్న దుర్వాసనతో జనం నరకం అనుభవిస్తున్నారు.
కుక్కలు, పందులు చెత్తా చెదారాన్ని చిందర వందర చేస్తున్నాయి. చికెన్, మాంసపు దుకాణాదారులు సైతం జీవాల వ్యర్థ్ధాలను అక్కడే పడేస్తున్నారు. పెద్దశంకరంపేట మేజర్ గ్రామపంచాయతీలో 14 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కేవలం ట్రాకర్ ఏర్పాటు చేసి అన్ని కాలనీల నుంచి చెత్తాచెదారం సేకరించి స్థానిక తిరుమలాపురం చెరువు కట్టవద్ద, రేగోడ్ వెళ్లే రహదారి పక్కన పడేస్తూ తగలబెడుతున్నారు. దీంతో ఈ రూట్లో రాకపోకలు సాగించేవారు దుర్వాసన భరించలేకపోతున్నారు. పొగతో వాయు కాలుష్యం పెరుగుతున్నది.
దోమలు, ఈగల తీవ్రత పెరిగిందని ఆయా కాలనీల వాసులు చెబుతున్నారు. పెద్దశంకరంపేట మేజర్ గ్రామపంచాయతీలో 14 వార్డుల్లో సుమారు 10 వేల జనాభా నివసిస్తున్నది. పట్టణం విస్తరిస్తుండడంతో నూతన గృహాలు, వాణిజ్య, వ్యాపార, సముదాయాలు ఏర్పాటవుతున్నాయి. వర్థ్ధ్యాల సేకరణకు చిన్నపాటి మినీ వాహనాలతో పాటు డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రభుత్వ స్థలాలు ఉన్నా డంపింగ్ యార్డు ఏర్పాటు గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పట్టణ ప్రజలకు కంపుతో తిప్పలు తప్పడం లేదు.