వెల్దుర్తి, నవంబర్ 19: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేరుచెప్పి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు విధులకు డుమ్మా కొడుతున్నారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ జరిపిన పరిశీలనలో ఈ విషయం బయటపడింది. బదిలీపై వచ్చినప్పటి నుంచి వెల్దుర్తి ఎంపీడీవో ఉమాదేవి విధులకు సరిగ్గా హాజరు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల దాటినా ఎంపీడీవో గది తలుపులు తెరుచుకోలేదు. ఎంపీడీవో కుర్చీ ఖాళీగా దర్శనమిచ్చింది. ఈ విషయమై కార్యాలయ సిబ్బందిని ‘నమస్తే తెలంగాణ’ ఆరాతీసింది. ఒకరు సర్వే తనిఖీకి వెళ్లిందని, మరొకరు కలెక్టరేట్‌కు పని నిమిత్తం వెళ్లినట్లు పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఎంపీడీవో ఉమాదేవిని ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో సంప్రదించగా.. తాను మంగళపర్తిలో సర్వేను పర్యవేక్షిస్తున్నానని తెలిపారు.
మధ్యాహ్నం 2 గంటల తరువాత సర్వే జరుగుతుంది కదా అని ప్రశ్నించగా.. తండాలు, మధిర గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సైతం సర్వే చేస్తున్నారని, మంగళపర్తిలో కార్యదర్శి చేస్తున్న సర్వేను తాను పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. మంగళపర్తి గ్రామానికి వెళ్లి కార్యదర్శి ఖదీర్‌ను ఆరాతీయగా సర్వే పరిశీలనకు కాని, పర్యవేక్షణకు ఎంపీడీవో గ్రామానికి రాలేదని తెలిసింది. మంగళపర్తి, మన్నెవారి జలాల్పూర్ గ్రామాలకు సర్వే సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న ఇరిగేషన్ ఏఈ జగత్ప్రభ మంగళవారం మంగళపర్తి గ్రామాన్ని సందర్శించి, మన్నెవారి జలాల్పూర్ గ్రామానికి వెళ్లినట్టు ఫోన్లో తెలిపారు. మన్నెవారి జలాల్పూర్ గ్రామానికి వెళ్లగా, తాను గ్రామంలో ఉన్నానని ఫోన్‌కు లొకేషన్ పంపుతానని చెప్పగా, ఎంతసేపు చూసిన ఎలాంటి స్పందన లేకపోవడంతో మళ్లీ ఫోన్ చేయగా, బిజీగా ఉంది. గ్రామంలో సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్‌ను ఆరాతీయగా గ్రామానికి ఎవరూ రాలేదని, తామే సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఇలా సర్వే పేరుతో గ్రామాల్లో ఉన్నామంటూ కొందరు అధికారులు విధులకు డుమ్మా కొడుతున్నారు.