దుబ్బాక, ఏప్రిల్ 19: దుబ్బాక మార్కెట్ యార్డులో శుక్రవారం కురిసిన అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందల క్వింటాళ్ల ధాన్యం తడిసింది. మరికొందరి రైతుల ధాన్యం వర్షపునీటిలో కొట్టుకుపోయింది. వరి ధాన్యం తడిసిన విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మార్కెట్ యార్డుకు వచ్చారు. తడిసిన ధాన్యం తో ఇబ్బందులు పడుతున్న రైతుల వద్దకు వెళ్లి ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మద్దతు ధర కోసం రైతులు మార్కెట్‌యార్డుకు ధాన్యం తీసుకొస్తే..కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సోలిపేట సతీశ్‌రెడ్డి, కొత్త కిషన్‌రెడ్డి, గన్నే భూంరెడ్డి, ఆస యాదగిరి ఉన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్19: మద్దూ రు మండలంలోని నర్సాయపల్లిలో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసింది. టార్పాలిన్లు కప్పినా కొంతమంది రైతుల ధాన్యం వర్షంనీటితో తడిసిపోయింది. ఆకునూరులో..
చేర్యాల, ఏప్రిల్ 19: మండలంలోని ఆకునూరులోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రంలో విక్రయించుకునేందుకు రైతులు తీసుకువచ్చిన ధాన్యం నానిపోయాయి. వర్షం వచ్చే సూచనలు గమనించిన పలువురు రైతులు తమ వెంట తెచ్చుకున్న టార్పాలిన్లు ధాన్యం కుప్పలపై కప్పినప్పటికీ బలమైన గాలులు వీయడంతో షీట్లు ఎగిరిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేర్యాల మండలం ఆకునూరులో వీచిన బలమైన గాలులకు పలువురు రైతులకు చెందిన మామిడి తోటలకు తీవ్ర నష్టం జరిగింది.
హుస్నాబాద్, ఏప్రిల్ 19: హుస్నాబాద్ మండలం మీర్జాపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో మామిడి తోటలతోపాటు గ్రామ శివారులోని వరిపంటకు సైతం స్వల్పనష్టం జరిగింది. కల్లాల్లో రైతులు ఆరబోసుకున్న వడ్లు తడిసిపోయాయి.పెద్ద ఎత్తున గాలి రావడంతో మామి డి కాయలు నేలరాలాయి.
నారాయణరావుపేట, ఏప్రిల్ 19:నారాయణరావుపేటతో పాటు లక్ష్మీదేవిపల్లి, గుర్రాలగొంది, మల్యాల, కోదండరావుపల్లి, బంజేరుపల్లి, జక్కాపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. మామిడి తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి.