కౌడిపల్లి, నవంబర్ 22: తన భర్త పేరిట ఉన్న ఎల్ఐసీ, రైతు బీమా డబ్బుల కోసమే కాకుండా వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను భార్య హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లిలో వెలుగుచూసింది. కేసుకు సంబంధించిన వివరాలను తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి మంగళవారం వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కౌడిపల్లి మండలంలోని పీర్లతండా పంచాయతీ కొయ్యగుండు తండాకు చెందిన కాట్రోత్ శ్రీను, దేవి భార్యాభర్తలు. వీరి వివాహం జరిగి 15 ఏండ్లు అవుతున్నది.
తన భర్త పేరు మీద ఉన్న ఎల్ఐసీ, రైతుబీమా సొమ్మును తాను పొందాలని నిర్ణయించుకున్నది. శ్రీనును హతమార్చి తాను విలాసవంతంగా జీవించాలని పన్నాగం పన్నింది దేవి. అంతేకాకుండా తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించింది. ఎలాగైనా అడ్డు తొలిగించుకోవాలని అదే తండాకు చెందిన పవన్‌కుమార్‌తో రూ.50 వేలు ఇస్తానని బేరం కుదుర్చుకున్నది. ఈనెల 18న తన పాలి వారితో జామచెట్టు విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవను అదునుగా తీసుకుని అదే తండాకు చెందిన దేవి స్నేహితురాలు రాణితో కలిసి తన భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేసింది.
పవన్‌కుమార్, రాణి సహాయంతో ఈనెల 18న మద్యం తాగేందుకు పవన్‌కుమార్, శ్రీనును గ్రామ సమీపంలోకి తీసుకెళ్లాడు. శ్రీను మత్తులోకి జారుకున్న అనంతరం దేవి నైలాన్ తాడును గొంతుకు చుట్టి సమీపంలోని వేప చెట్టుకు ఉరేసి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని 600 మీటర్ల దూరంలోకి పవన్‌కుమార్, రాణితో కలిసి లాక్కెళ్లి పడేశారు. ఈ నెల 19న ఉదయం తండావాసులకు పొలం వద్ద శ్రీను మృతదేహం కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా సీఐ షేక్లాల్మదార్, ఎస్సై శివప్రసాద్‌రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి క్లూస్ టీంతో పరిశీలించారు.
ఈ నేరం పాలి వారి మీదకు నెట్టేందుకు ప్రయత్నించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. పోలీసులు చాకచక్యంగా సెల్ ఫోన్ సంభాషణల ఆధారంగా నిందితులైన దేవి, పవన్‌కుమార్, రాణిని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన నైలాన్ తాడు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన నర్సాపూర్ సీఐ షేక్‌లాల్ మదార్, కౌడిపల్లి ఎస్సై శివప్రసాద్‌రెడ్డి, కానిస్టేబుళ్లను డీఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.