జహీరాబాద్, అక్టోబర్ 10: పండుగ పూట జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్‌లలో ప్రజలు తాగునీటికి కష్టాలు పడుతున్నారు. 24 రోజులుగా దాదాపు 75 గ్రామాలకు మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రాఘవాపూర్ శివారులోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ నుంచి ఆయా మండలాలకు తాగునీరు సరఫరా అవుతుంది.
అక్కడ పని చేసే తాత్కాలిక కార్మికులకు ఎనిమిది నెలలుగా కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదు. పలుమార్లు సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌కు తమ గోడును వెల్లబోసుకున్నా ఫలితం లేకపోవడంతోనే అందోళనకు దిగినట్లు కార్మికులు తెలిపారు. మిషన్ భగీరథ నీళ్లను నమ్ముకున్న జనం ముప్పుతిప్పలు పడుతున్నారు. పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ట్యాంకర్ల వద్ద జనం గుమికూడడంతో మహిళల మధ్య ఘర్షణకు తావిస్తోంది. దీంతో గ్రామాల సమీపంలోని వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు.
అధికారులు తగు చర్యలు తీసుకుని తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆయా మండలాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. ఈ విషయాన్ని మిషన్ భగీరథ అధికారుల దృష్టికి తీసుకెళ్లాగా..ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది వాస్తవమే.. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మి షన్ భగీరథ తాత్కాలిక కార్మికుల వేతనాల కోసం అధికారులు, కాంట్రాక్టర్‌తో చర్చిస్తున్నామన్నారు. కార్మికులకు రావాల్సిన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.