Ramayampet | రామాయంపేట : ఉపాధిహామీలో జరిగిన పనుల లెక్కల్లో తేడాలు వస్తే సహించేది లేదని.. డీఆర్డీవో శ్రీనివాస్ హెచ్చరించారు. రామాయంపేట మండల కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఉపాధిహామీ సామాజిక తనిఖీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఫీల్డ్ అస్టెంట్ల రికార్డులను అణువణువు పరిశీలించారు. రామాయంపేట మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల ఫీల్డ్ అసిసెంట్ల రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పనుల్లో లెక్కల్లో ఎలాంటి తేడాలు వచ్చినా ఫీల్డ్ అస్టెంట్లు కట్టాల్సిందేనన్నారు.
గ్రామాల్లో కొంతమంది ఉపాధి సిబ్బంది ఇష్టారాజ్యంగా పనిచేశారని.. లెక్కలు తీసి వారందరితో కక్కిస్తామన్నారు. ఇష్టమొచ్చినట్లు రికార్డుల్లో రాస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. లెక్కల్లో ప్రతి ఉపాధి పనికి లెక్క రికార్డుల్లో నమోదు ఉండాల్సిందేననన్నారు. లెక్కల్లో ఎలాంటి తేడాలొచ్చినా వారిపై చర్యలతో పాటు అవసరమనుకుంటే కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వానికి బకాయిపడ్డ ప్రతి ఒక్క ఫీల్డ్ అస్టెంట్ వద్ద నుంచి డబ్బులు రికవరీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో షాజులుద్దీన్, విజిలెన్స్ అధికారి, ఏపీవో శంకర్ పాల్గొన్నారు.