పాపన్నపేట, అక్టోబర్ 3: తెలంగాణ అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆమె పాపన్నపేట మండల పరిధిలోని బాచారం గ్రామంలో నూతనంగా నిర్మించిన 48 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని తెలిపారు. అన్ని గ్రామాల్లో రోడ్లు, శ్మశాన వాటికలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిన ఘనత కేవలం కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. మెదక్‌లో ఈ నెల 5న మెడికల్ కాలేజీకి భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఘణపూర్ ఆనకట్ట ఎత్తు పెంచడంతో పాటు ఎఫ్ఎన్ఎంఎన్ కెనాళ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.
హైదరాబాద్‌కు తరలించే సింగూర్ నీటిని కేవలం ఇక్కడి ప్రాంతానికే కేటాయించే విధంగా సీఎం కేసీఆర్ జీవో జారీ చేసిన విషయం గుర్తు చేస్తూ మంజీరా నదిలో చెక్‌డ్యాంలు కట్టి నీటిని నిల్వ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఆరు హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, సాధ్యం కాని హామీలను ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని ఆమె కోరారు. తమను మళ్లీ గెలిపిస్తే బాచారంలో ఫంక్షన్‌హాల్ నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతకుముందు పాపన్నపేటలో రైతులకు అవసరమయ్యే పరికరాలను అద్దెకిచ్చే కేంద్రాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, గడిల శ్రీనివాస్‌రెడ్డి, పాపన్నపేట, కుర్తివాడ, బాచారం గ్రామాల సర్పంచ్‌లు గురుమూర్తి గౌడ్, లింగారెడ్డి, స్రవంతి శ్రీనివాస్, వెంకట్, రాములు, మాజీ ఎంపీపీ పవిత్రాదుర్గయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుమ్మరి జగన్, మల్లేశం, దుర్గయ్య, సీనియర్ నాయకుడు చంద్రం, బాబాగౌడ్, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.