రామచంద్రాపురం, నవంబర్ 9: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి కొల్లూర్‌లోని కేసీఆర్‌నగర్ 2బీహెచ్‌కే సముదాయంలో ఉన్న జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ శ్రమిస్తున్నది. మొన్న కొల్లూరులో హరీశ్‌రావు సమావేశం గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. హరీశ్‌రావు సమావేశానికి కొల్లూరులోని డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు, కుటుంబీకులు భారీగా తరలివచ్చి బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. దీంతో అధికార కాంగ్రెస్ ఆందోళనకు గురైంది. వారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు చివరి ప్రయత్నం చేశారు. ఆదివారం 2బీహెచ్‌కే సముదాయంలోని జూబ్లీహిల్స్ ఓటర్లతో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజారుద్దీన్, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని, కొల్లూర్ 2బీహెచ్‌కేలో మొత్తం 16వేల కుటుంబాలు, 48వేలకు పైగా ప్రజలు నివాసం ఉంటున్నారని, 24గంటల్లో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సన్నబియ్యం లబ్ధిదారులకు రేషన్ దుకాణాలు, కాలనీలోపల ఆర్టీసీ బస్సుల సౌకర్యం, కాలనీవాసుల భద్రత కోసం శాశ్వత పోలీస్‌స్టేషన్ ఏర్పాటు, గృహజ్యోతి పథకంతో 200యూనిట్ల ఉచిత కరెంట్, వృద్ధులకు పింఛన్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీలు గుప్పించారు. జూబ్ల్లీహిల్స్ ఎన్నికలు ఉండడంతోనే కాంగ్రెస్ మంత్రులు,నాయకులు ఇంత ప్రేమ చూపిస్తున్నారని, లేదంటే ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదనే భావన 2బీహెచ్‌కే లబ్ధిదారులకు ఉన్నది.
2బీహెచ్‌కే సముదాయంలో ఇటీవల కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం అట్టర్ప్ల్లాప్ అయ్యింది. ఆ తర్వాతి రోజు బీఆర్ఎస్ నాయకులు నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సూపర్ సక్సెస్ అయ్యింది. మైదానం మొత్తం నిండిపోయేలా లబ్ధిదారులు స్వచ్ఛందంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మీటింగ్‌కు తరలివచ్చారు. కేరింతలు కొడుతూ, డ్యాన్సులు చేస్తు వారి అభిమానాన్ని చూపించారు. ఆ రోజు కొల్లూర్ 2బీహెచ్‌కే సముదాయం మొత్తం గులాబీ వర్ణంగా మారింది. ఎటుచూసినా గులాబీ కండువాలతో 2బీహెచ్‌కే లబ్ధిదారులు కనిపించారు. లబ్ధిదారుల కండ్లల్లో కేసీఆర్ తమకు సొంతింటి కలను నెరవేర్చారనే ఆనందం కనిపించింది.
జనాల కోసం మూడుసార్లు బీఆర్ఎస్ నాయకులు కుర్చీలు తెప్పించినా ఆనాటి సమావేశంలో సరిపోలేదు. ఇంత పెద్ద స్థాయిలో లబ్ధిదారులు అభిమానం చూపిస్తారని బీఆర్ఎస్ నేతలు అసలు ఊహించనేలేదు. ఒక్కసారిగా వారి అభిమానం మొత్తం ఆత్మీయ సమ్మేళనంలో లబ్ధిదారులు బీఆర్ఎస్ నాయకులకు చూపించారు. మా గుండెల్లో ఎప్పటికి కేసీఆర్ సారే ఉంటారని కుండబద్ధలు కొట్టినట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. బీఆర్ఎస్ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో కంగుతిన్న కాంగ్రెస్ నేతలు చివరి ప్రయత్నంగా ఆదివారం 2బీహెచ్‌కేలో జూబ్ల్లీహిల్స్ ఓటర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కాంగ్రెస్ స్థానిక నాయకులు భరత్, ప్రభాకర్‌రెడ్డి, అరుణ్గౌడ్, సుధాకర్‌రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.