మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 17: ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలన్నీ సత్వరమే పరిష్కరించాలని మెదక్ జిల్లా ఉద్యోగ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ దొంత నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం మధ్యా హ్నం భోజన విరామ సమయంలో మెదక్ కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద ఉద్యోగ భాగస్వామ్య సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న మూడు విడతల కరువు భత్యం విడుదల చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఐదు విడతల కరువు భత్యం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు పీఆర్సీ కమిషన్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న రూ.13వేల కోట్ల బకాయిలు యుద్ధప్రాతిపదికన విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు మూలనిధి ఏర్పాటు చేసి నగదు రహిత ఆరోగ్య కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సాధారణ ఎన్నికలకు ముందు నూతన పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని ప్రవేశపెడతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జేఏసీ ప్రధాన కార్యదర్శి విఠల్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్, విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు మహేందర్‌గౌడ్, సతీశ్‌రావు, చరణ్‌సింగ్, కిషన్, అనురాధ, ఇక్బాల్‌పాషా , రఘనాథరావు, శివాజీ, శంకర్, శ్రీహరి, జగదీశ్చంద్ర, లింగప్ప, సత్యనారాయణ, సునీల్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గ్గొన్నారు.